గూడూరు పాకాల వాగు శివారు పొలాల్లో చిరుత సంచారం

by Ratna Kumari |

గత కొద్ది రోజులుగా గూడూరు, ఖానాపురం అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

గూడూరు పాకాల వాగు శివారు పొలాల్లో చిరుత సంచారం
X

దిశ, గూడూరు : గత కొద్ది రోజులుగా గూడూరు, ఖానాపురం అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గూడూరు మండలంలోని దస్రు తండా శివారులోని మామిడి తోటలో చిరుత కనిపించినట్లు గ్రామస్థులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం సాయంత్రం గూడూరు పాకాల వాగు శివారు పొలాల్లో చిరుత సంచరించినట్లు సమాచారం అందింది. ఆదివారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా చిరుత పాదముద్రలు కనిపించాయి. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించి అవి చిరుత పాదముద్రలేనని నిర్ధారించారు.

ఈ సందర్భంగా గూడూరు రేంజ్ అటవీ శాఖ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ, చిరుతపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేయవద్దని, దానికి ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచించారు. గూడూరు పరిసరాల్లో అటవీ ప్రాంతం ఉండటంతో చిరుత తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే చిరుత సంచారం లేదా పాదముద్రలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిరుత ఆచూకీ కోసం అటవీ శాఖ ప్రత్యేక బృందాలు పాకాల వాగు, కోడి చెరువు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Next Story