కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం.. నలుగురు కూలీల మృతి!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-17 03:44:27  IST  )

ఇటానగర్ నీతి విహార్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు కూలీల మృతి. నిర్మాణంలో ఉన్న గోడ కూలి శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు; ముగ్గురికి తీవ్ర గాయాలు.

కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం.. నలుగురు కూలీల మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం (Landslide)తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని నీతి విహార్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో, అక్కడ నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ (Protection Wall) కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పని చేస్తున్న ఏడుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), పోలీసులు, స్థానిక పరిపాలన యంత్రాంగం రంగంలోకి దిగి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

ఈ విషాద ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను చోకి తసర్ (23), గోడక్ రాజా (30), గోడక్ తబిన్ (35), రతన్ బర్మన్ (26)గా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని హీమా ఆసుపత్రికి తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల మట్టి మెత్తబడి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, అయినప్పటికీ శ్రమించి శిథిలాల నుంచి బాధితులను వెలికితీశామని ఇటానగర్ అసిస్టెంట్ కమిషనర్ తమో దాదా తెలిపారు.

Next Story