- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలూరులో భూసేకరణ కలకలం.. పారిశ్రామికవాడకు 'నో' అంటున్న అన్నదాతలు
చేవెళ్ల మండలం ఆలూరులో భూసేకరణ సెగ! పారిశ్రామికవాడ కోసం 1,248 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్. ఎకరాకు రూ. 50 లక్షల పరిహారం కోరుతున్న రైతులు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం సాగు భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పంటలు పండించుకుంటున్న భూములను తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భూములు తీసుకుంటే ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దిశ, చేవెళ్ల: ఆలూరు-1, 2, 3 రెవెన్యూలో 1,248 ఎకరాల 22 గుంటల వక్ఫ్ బోర్డు భూములున్నాయి. వాటిని 360 మందికి పైగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ఉన్న రైతులకు 2016 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని ప్రకటించింది. రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకోవాలంటే ఎకరాకు రూ.50 లక్షలు పరిహారంతో పాటు వెయ్యి గజాల ప్లాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మార్కెట్లో ఎకరం భూమి రెండు కోట్ల నుంచి రూ.3 కోట్ల ధర పలుకుతుంది. కొందరు రైతులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇతర అవసరాలకు వక్ఫ్ భూములను ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇతరులకు నోటరీ ద్వారా అమ్ముకున్నారు. ఇలా కొన్న రైతులు కొందరు సాగు చేసుకుంటుండగా, మరికొందరు సాగు చేయకుండా వదిలేశారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వారి పేర్లు లేవు. అమ్మిన రైతుల పేర్లే ఉన్నాయి. భూములు కొన్న రైతులు తమకు పరిహారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భూములు కోల్పోతున్న రైతులతో ఇప్పటికే చేవెళ్ల తహశీల్దార్ బీ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు.
నేడు ఆలూర్ లో రైతులతో సమావేశం
ఆలూర్ గ్రామంలో చేవెళ్ల ఆర్డీవో పార్థ సింహారెడ్డి, చేవెళ్ల తహశీల్దార్ కృష్ణయ్య, వక్ఫ్ బోర్డు అధికారులు శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. వక్ఫ్ బోర్డుకు, మరో సగం రైతులకు వక్స్ బోర్డు భూములపై ఎన్నేళ్లయినా రైతులకు పూర్తి హక్కులు ఉండవన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంలో సగం వక్స్ బోర్డుకు, మరో సగం రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. రైతులకు తగిన పరిహారం వస్తుందని, ఆందోళన చెందవద్దని సూచించారు. భూసేకరణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం : పార్థసింహారెడ్డి, ఆర్డీవో చేవెళ్ల
రైతుల డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఎంజాయ్ మెంట్ సర్వే చేసి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. షాబాద్ మండలం సీతారాంపురం తరహాలోనే రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలూరులో గ్రామసభలు పెట్టి రైతుల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే భూములు తీసుకుంటాం. పారివ్రామికవాడతో ఆలూరు ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి.
ఎకరాకు 50 లక్షలు ఇవ్వాలి: రైతులు
ఆలూరులోని వక్స్ బోర్డు భూముల్లో మా నాలుగు కుటుంబాలకు మొత్తం 80 ఎకరాలు ఉంది. మా తాతల కాలం నుంచి ఈ భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం మా భూములను తీసుకుంటుందని తెలిసి మా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వం ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తేనే భూమిని వదులుకుంటాం.
భూముల సేకరణకు నోటిఫికేషన్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1248.22 ఎకరాల వక్ఫ్ భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా సుమారు 300 కుటుంబాలకు చెందిన రైతులు ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆలూరు గ్రామంలో హజ్రత్ మద్దుం బియాబాని దర్గాకు మొత్తం 1293.23 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాల క్రితం ఇనాం పట్టాల ద్వారా ఆ భూములు తమకు సంక్రమించాయని.. వాటిని సాగు చేసుకుంటున్న సంబంధిత రైతులు చెబుతున్నారు.
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆలూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు రైతులకు నోటీసులిచ్చారు. సంబంధిత ప్రతిపాదన కొన్నాళ్లకు మరుగున పడింది. రైతులు అప్పటి నుంచి యథావిధిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో.. భూముల్లోని 1248.22 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తా మని ప్రకటించినప్పటికీ వారంతా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.






