- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ చేతిలోనే పొత్తు అంశం : కూనంనేని
కాంగ్రెస్ తో పొత్తు అంశం వారే ఆలొంచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని వ్యాఖ్యానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కమ్యూనిస్టులను, కమ్యూనిస్టు పార్టీలను చిన్నచూపు, తక్కువ చూపు చూసే వారికి, కమ్యూనిజం ఎక్కడ ఉన్నదనే వారికి కొత్తగూడెం మేయర్ ఎన్నిక ఒక చెంప పెట్టు లాంటిదని, ఒక గుణపాఠమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఒక సవాల్ తీసుకుని తమకు బలమైన స్థానాల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, జిల్లాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలలో కూడా తమ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. ఆ లక్షం దిశగానే నగరపాలక సంస్థలలో ప్రజలను సమాయత్తం చేస్తున్నామన్నారు. శాసనసభలో కూడా ఒక్క సీటుతో సరిపెట్టుకోబోమని, పది నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, అసెంబ్లీలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకుంటామని, ఇందుకు వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
కొత్తగూడెంలో అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ తాము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిశామని, భవిష్యత్తులో పొత్తు కొనసాగడమా? లేదా? అనేది కాంగ్రెస్ చేతిలోనే ఉన్నదని కూనంనేని స్పష్టం చేశారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం( మగ్ధూం భవన్)లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, ఎంఎల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సాంబశివరావు మాట్లాడారు. కొత్తగూడెం మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో అపూర్వఘట్టం ఆవిష్కరించబడిందని, మొదటి మేయర్ కమ్యూనిస్టు కావడం, అందులోనూ సాధారణ వ్యక్తి, ఆటోడ్రైవర్ మేయర్ చేయడం పట్ల పేద, శ్రామిక, కార్మిక వర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టులకు ఏదో మద్దతునిచ్చినట్టుగా హావభావాలను ప్రదర్శిస్తాయని, గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగూడెంలో కాంగ్రెస్ కంటే సీపీఐకి రెండు వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ సమానంగా ఓట్లు పోలయ్యాయని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైందని, సీపీఐ 9 వార్డులలో గెలిచిందని, మొదటి నుంచి సీపీఐ ఓంటరిగానే గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్, మరో ఐదారు ఆఫర్లు ఇచ్చినప్పటికీ తాము జాతీయ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్దుబాటులో ఉన్నామని, జిల్లా విషయం వచ్చే సరికే అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ సీఎం, కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి చొరవతో పొత్తు కుదిరిందన్నారు. ఎన్నికలకు ముందు సర్దుబాటు కుదరకపోయినా తాము ఒక సవాల్ తీసుకుని ప్రజాక్షేత్రంలో తాము ఏమిటో రుజువు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో కమ్యూనిస్టులతో పొత్తును విచ్చిన్నం చేసుకుందామనే ఆలోచన లేదని, అందులో భాగంగానే కొత్తగూడెంలో కాంగెస్ ముందుకు వచ్చిందన్నారు.
కొత్తగూడెంలో బిజెపి ఎక్కడుంది?..
కమ్యూనిస్టుల పని అయిపోయిందని, పరాన్న జీవులని, తోక పార్టీలని, ఎవరిపైనో ఆధారపడుతారని చెబుతున్నారని, కమ్యూనిస్టులు ఎక్కడ అని తమను ప్రశ్నిస్తున్న బీజేపీ ఇంతకు కొత్తగూడెంలో ఎక్కడ ఉన్నదని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కమ్యూనిజానికి, కమ్యూనిస్టులకు పుల్ ఉండబోదని, ఇది నిరంతర ప్రక్రియ , నిరంతర పోరాటం అని అన్నారు. గతంలో జాతీయ, ఉమ్మ డి ఏపీలో బీజేపీ స్థానం ఏమిటని ప్రశ్నించారు. అజ్ఞానులు మాత్రమే కమ్యూనిస్టులు ఎక్కడ అని మాట్లాడుతారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల చరిత్ర ఉన్నదని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ సజీవంగానే ఉన్నదన్నారు. కార్పొరేట్ రాజకీయాలను తట్టుకుని నిలబడడం కష్టమని, ఎలక్టోరల్ రంగంలో తాము వెనుకపడొచ్చన్నారు. రైతాంగం, శ్రామిక, కార్మిక, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరిస్తున్నారని, ఏడారిలో ఓయాసిస్, కారు చీకటిలో కాంతిరేఖ తరహా కొత్తగూడెం ఎన్నిక అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండలో 4 వార్డులను, రామగుండంలో సత్యం అనే యువకుడు వెయ్యి ఓట్లతో విజయం సాధించారని తెలిపారు. గతంలో సీపీఐకి 20 స్థానాలు ఉంటే, ప్రస్తుతం 41 స్థానాలలో సీపీఐ గెలిచిందని, గ్రామ పంచాయతీలో గతంలో 75 స్థానాలు ఉండగా, 101 స్థానాలను గెలిచామని కూనంనేని తెలిపారు.
ఏకమయ్యే వరకు పొత్తు సమస్యలు..
మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి సీపీఎం కొన్ని చోట్ల బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలతో పొత్తుకుందని సాంబశివరావు అన్నారు. తాము కూడా స్థానిక పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకుందామని చర్చించామని, కానీ జాతీయ పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలన్ని ఐక్యపోరాటాలు నిర్వహిస్తున్నా..ఎన్నికల్లో పొత్తు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కమ్యూనిస్టులు ఏకమయ్యే వరకు పొత్తు సమస్యలు ఉంటాయని, ఎప్పటికైనా కలవాల్సిందేనని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం
సీపీఐని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని, అందుకు తమ సర్వ శక్తులనూ ఒడ్డుతామని కూనంనేని సాంబశివరావు అన్నారు. పది నియోజకవర్గాలను ఎంపిక చేసి, ప్రత్యేక దృష్టి పెడుతామని, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీని విస్తరిస్తామన్నారు. ప్రజలు కమ్యూనిస్టుల పట్ల ఆదరణ చూపిస్తున్నారన్నారు. వామపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తామని కానీ ఎన్నికల సమయంలో కొన్ని సందర్భాల్లో సీట్ల సర్దుబాటు కూదరకపోవచ్చని, ఇలాంటి అన్ని సమస్యలకూ అన్ని కమ్యూనిస్టు పార్టీల విలీనం ఒక్కటే పరిష్కారమని కూనంనేని అన్నారు. తాము త్యాగం చేశామని, ధైర్యంగా పోరాటం చేశామని, గెలువాలనే లక్షం పెట్టుకుని గెలిచామని, ప్రస్తుతం తాము సరైన వైఖరినిని తీసుకున్నామని, ఇలాగే ముందుకు వెళ్తామని కూనంనేని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటిచే్యడమే కాదని, కచ్చితంగా కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.
పోలీసుల అరాచకాలు..
కొత్తగూడెంలో పోలీసులు అరాచకంగా వ్యవహారించారని, ఎర్రచొక్కా వేసుకున్నవారిని ఆ చొక్కను విప్పించారని, క్యాతన్ పల్లి ఎర్ర చొక్క వేసుకున్న ఒక ఓటరును పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లనివ్వలేదని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడిన పోలీసులను ప్రభుత్వం కూడా నియంత్రించాలని, ఇది పోలీసు రాజ్యం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలిచేందుకు ప్రయత్నించాలని, ప్రతిపక్షాలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఒక ఇన్ స్పెక్టర్ తన వద్ద ఉన్న తుపాకీని చూపించి నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించడం గర్హనీయమన్నారు. స్నేహాం, స్నేహమేనని, పొత్తులు పొత్తులేనని, కానీ అన్యాయం జరిగితే మాత్రం చెప్పాల్సిందేనని, చాలా చోట్ల ఇదే జరిగిందని కూనంనేని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుందని, ఇది సరైన పద్ధతికాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్దమైనవన్నారు.






