- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. హామీల అమలును తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సిట్ అనేది రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటది.. స్టాండ్ అంటే నిల్చుంటదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో కొన్ని రోజులు డ్రామా.. ఈ కార్ రేసు కొన్నిరోజులు, గొర్రెల స్కామ్ అంటూ కొన్ని రోజులు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ కొన్ని రోజులు డ్రామా చేసి వదిలేస్తారు.. ఇందులో ఏం లేదు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుకు, నాకు నోటీసులు ఇచ్చారని అన్నారు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం, ప్రజల భద్రత కోసం, ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడటం కోసం 1952(నెహ్రూ కాలం) నుంచి నేటి వరకు నిఘా వ్యవస్థలు చేస్తాయని అన్నారు.
ఫోన్ ట్యాప్ చేయడం నేరం ఎలా అవుతుంది?
అది నేరమేం కాదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు సంబంధం ఉండదు.. పోలీసు వ్యవస్థ కనుసన్నల్లోనే జరుగుతుందని అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ట్యాపింగ్ చేస్తారని అన్నారు. ఇది పూర్తిగా ట్రాష్ కేసు.. ఇందులో ఏం ఉండదని కొట్టిపారేశారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డినే అని అన్నారు. ఆయనను వదిలేసి మమ్మల్ని పిలిస్తే ఏం వస్తదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్షాల ఫోన్‌లను రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాము విచారణ జరిపిస్తే వీళ్లంతా కూడా జైలుకు పోతారని అన్నారు.రేపు విచారణకు వెళ్తా
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ తమ ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని అన్నారు. మరి వారి వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నాకు నోటీసులు అందాయి. రేపు విచారణకు వెళ్తా అని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్తీకదీపం సీరియస్‌లా ఈ కేసును కొనసాగిస్తూ కాలయాపన చేయడం తప్ప.. ఈ కేసులో ఏం లేదని కేటీఆర్ విమర్శించారు.






