- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సీపీఐకే
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తలెత్తిన ఉత్కంఠకు చెక్ పెడుతూ, అధికార కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ చేతులు కలిపాయి.

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సీపీఐ, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ తీసుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో ఆ పార్టీ నేతలు సమావేశమై మేయర్, డిప్యూటీ మేయర్‌పై చర్చించి, కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కావడంతో ఆ స్థానాల్లో నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆశల పల్లకిలో ఉండగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. సీపీఐ నుంచి మూడ్ గణేష్, నూనావత్ శ్యామల, బానోత్ కళావతి గెలుపొందగా వీరిలో ఒకరికి మేయర్‌గా అవకాశం దక్కనుంది. కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకుంటే ఇక తమ అవసరం ఉండదని స్వతంత్రులు నిరాశలోకి వెళ్లగా, సీపీఐ తమతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ కొండంత ఆశతో ఉన్నా చివరికి అడియాసే మిగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీనీ సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, బీఆర్ఎస్‌ను మరింత బలహీనపర్చాలన్నా కమ్యూనిస్టులతో కలిసి ఉండటమే మేలని భావించే మేయర్ పీఠాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి రెండున్నరేళ్లు అధికారంలో ఉండనుండగా, విడిపోవడం కంటే కలిసి ఉంటేనే మేలు జరుగుతుందని భావించి సీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దిశ, కొత్తగూడెం ప్రతినిధి
దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కొత్తగూడెం కార్పొరేషన్ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో అధికార పార్టీ కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐలకు తల నొప్పులు మొదలయ్యాయి. కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు ఎవరికి తోచినట్లుగా వారు మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. అయితే శనివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డితో సమావేశమై చర్చించి, కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సీపీఐకి మేయర్, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ ఇచ్చేందుకు ఇరు పార్టీల నాయకులు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆశల పల్లకీలో కార్పొరేటర్లు
మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కావడంతో ఆ స్థానాల్లో నుంచి కాంగ్రెస్, సీపీఐ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆశల పల్లకిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వైద్యులు బీ. శ్రీనివాస రావు, కేతావత్ స్వప్న, బానోత్ అనిత, బానోత్ బాలు, గుగులోతు శ్రీను ల ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది. సీపీఐ నుంచి గెలిచిన మూడ్ గణేష్, నూనావత్ శ్యామల, బానోత్ కళావతి లు తమలో ఒకరికి అవకాశం దక్కనుంది. అయితే అధిష్టానం వద్ద తమ పలుకుబడిని ఉపయోగించుకొని మేయర్ పదవి నీ దక్కించుకునేందుకు వీరు లాబీయింగ్ ప్రారంభించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పని చేశాయి. కేంద్రంలోని బీజేపీ నీ ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా కలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండనుంది.
అలాంటప్పుడు విడిపోవడం కంటే కలిసి ఉండి కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు అని , అనవసరంగా పొత్తును విచ్చిన్నం చేసుకొని ఒంటెద్దు పోకడలకు పోవడం ఎందుకు అని కూడా ఆలోచించి ఇరు పార్టీల నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకోవడమే మేలని భావించి సీపీఐ కూడా చొరవ చూపినట్లు భావించవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా కమ్యూనిస్టులను వదులుకునేందుకు సిద్ధ పడేందుకు సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీనీ సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న, బీఆర్ఎస్‌ను బలహీనపర్చాలన్నా కమ్యూనిస్టులతో కలిసి ఉండటమే మేలని భావించే మేయర్ పీఠాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పవచ్చు.
స్వతంత్రుల ఆశలపై నీళ్లు
కాంగ్రెస్, సీపీఐలు పొత్తు పెట్టుకుంటే ఇక తమ అవసరం ఉండదని స్వతంత్రులు భావిస్తున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం అవసరమైన కోరం 31 (కాంగ్రెస్ 22, సీపీఐ 22 మొత్తం 44 ) ఉండటంతో సులువుగానే మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి, అధికార పార్టీని ఎదిరించి ఇల్లు, నగలు ఆస్తులు తాకట్టు పెట్టి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్రులుగా గెలిచిన వారు తమ పంట పండిందని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు, తమకు కావాల్సినవి సమకూర్చితే ఏ పార్టీకైన మద్దతు ఇస్తామని ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు రెండు పార్టీలు ఏకమైతే మాతో అవసరం లేదని అనుకుంటున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు ఒకే దెబ్బతో వచ్చేస్తాయని కలలు కంటున్న వారికి ఆ పార్టీల పొత్తు ఉండవద్దని కోరుకుంటున్నట్లు సమాచారం. కానీ ఇరు పార్టీల నాయకులు మేయర్ , డిప్యూటీ మేయర్‌పై ఏకాభిప్రాయం కుదిరిందన్న వార్త వారి కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ ఎదురుచూపులు
సీపీఐ తమతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆశతో ఉన్నారు. తద్వారా కొత్తగూడెం కార్పొరేషన్ పై కొంతైనా తమ పట్టు నిలుపుకోవచ్చని, కాంగ్రెస్‌ను ఈ రకంగా దెబ్బ కొట్టవచ్చని భావించి ఎటువంటి ఒప్పందాలు, షరతులు లేకుండానే భేషరతుగా తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సీపీఐ నుండి ఎటువంటి ప్రపోజల్ రాకపోవడం పై ఆ పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్‌తో కలిసి వెళితే పార్టీకి నష్టమని అధికార పార్టీతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
అభివృద్ధి, నిధుల విడుదల విషయంలో జాప్యం జరిగితే అది నియోజకవర్గ అభివృద్ధిపై పడుతుందని, ఫలితంగా ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో కలిసి వెళితే పార్టీ కి నష్టం తో పాటు, అభివృద్ధి లో రాజీపడాల్సి ఉంటుందని నాయకులు చెబుతున్నారు.
క్యాంప్‌లో కార్పొరేటర్లు
కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను ఇప్పటికే క్యాంప్‌నకు తరలించారు. హైదరాబాద్‌లోని ఓస్టార్ హోటల్లో కార్పొరేటర్లకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఇక సీపీఐ కార్పొరేటర్లు ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిబిరానికి, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. వీరంతా సోమవారం ఉదయం కొత్తగూడెం పట్టణానికి చేరుకుంటారని నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ , సీపీఐ కలిసి వెళ్తాయని ప్రకటన రావడంతో సీపీఐలో ఎవరికి మేయర్ పీఠం దక్కనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీపీఐ నుంచి గెలిచిన ముగ్గురు మొదటిసారి ఎన్నికైనవారే కావడం గమనార్హం.






