- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినూత్న ఈ - వేలం విధానంతో ఖరీఫ్ మొక్కజొన్న విక్రయం: మంత్రి తుమ్మల
మార్క్‌ఫెడ్ మొక్కజొన్నను నూతన ఈ-వేలంలో విక్రయించి ₹202.56 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడి; ఎనుమాముల మార్కెట్ నూతన కమిటీ నియామకం.

దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలను వినూత్న ఈ-వేలం విధానంలో విక్రయించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.202.56 కోట్లు ఆదా అయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ప్రస్తుత యాసంగి పంటల కొనుగోళ్లు జరుగుతుండటంతో గోదాములలో నిల్వ ఉన్న ఖరీఫ్ మొక్కజొన్నను ఒక నెలలోపు పూర్తిగా లిఫ్ట్ చేసి గోదాములను ఖాళీ చేయాలని హెచ్-1 బిడ్డర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి, కొత్తగా కొనుగోలు చేస్తున్న పంట నిల్వలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గత పదేళ్లుగా మార్క్‌ఫెడ్‌లో మొక్కజొన్న విక్రయాల కోసం గోదాముల వారీగా ఈ-టెండర్లు నిర్వహించడం, ఆశించిన ధరలు రాకపోతే టూ-బిడ్ సిస్టమ్ ద్వారా ఈ-టెండర్లు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిందన్నారు. అదే విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించిన ఈ-టెండర్లలో సుమారు సగం పరిమాణానికి మాత్రమే మెట్రిక్ టన్నుకు సగటున రూ.14,355 ధర లభించగా, మిగిలిన నిల్వలకు బిడ్డర్లు ముందుకు రాలేదని తెలిపారు. అనంతరం ఏప్రిల్ 24న నిర్వహించిన ఈ-టెండర్లలో కూడా మెట్రిక్ టన్నుకు కేవలం రూ.14,010 మాత్రమే ధర లభించిందని, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ టెండర్లను కూడా ఆమోదించకుండా రద్దు చేసినట్లు వివరించారు.
పాత విధానానికి పూర్తిగా భిన్నంగా దేశవ్యాప్తంగా మరింత మంది వ్యాపారులు పాల్గొనేలా కొత్త ఈ-వేలం విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ నూతన విధానంలో భాగంగా మే 29న నిర్వహించిన ఈ-వేలంలో తీవ్ర పోటీ నెలకొనడంతో మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,337 ధర లభించిందని, ఇది గత టెండర్లలో లభించిన ధరతో పోలిస్తే టన్నుకు రూ.5,327 అధికమని వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను ప్రభుత్వం మెట్రిక్ టన్నుకు రూ. 29,272 ఖర్చు చేసిందని చేసిన మొత్తం ఖర్చు తో పోల్చితే ఒక్క ఖరీఫ్ మొక్కజొన్న సేకరణకే సుమారు రూ.400 కోట్ల నష్టాన్ని భరించిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపడుతోందన్నారు.
ఎనుమాముల మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం
మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలకవర్గానికి చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్‌గా బండి జనార్ధన్‌ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 191 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు వెల్లడించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ యార్డుల్లో పారదర్శకతను పెంపొందించడం, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.






