తెలంగాణలో ఈసారి ఖరీఫ్ సాగు డౌన్

by Malleboina Mahesh |

వాతావరణ మార్పుల వల్ల తెలంగాణలో ఈ ఖరీఫ్ సాగు కోటి ఎకరాల లోపే ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

తెలంగాణలో ఈసారి ఖరీఫ్ సాగు డౌన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా ఈ ఖరీఫ్ ​సీజన్లో పంట సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎల్​నినో ప్రభావం తో రైతులు కూరగాయలు, పండ్లు, తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో వరిసాగు సగానికి పైగా తగ్గుతుందని భావిస్తోంది. ఈ వానాకాలం సీజన్​లో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాలని గత నెలలో రైతులకు సూచించి ఆ దిశగా విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచింది. వాతావరణ శాఖ జూలై, ఆగస్టు నెలలో మధ్యంతర కరువు వస్తుందని, ఆరుతడి పంటలే వేయాలని ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన శాఖ సంయుక్తంగా గ్రామాల్లో రైతులకు నీటి వినియోగం అధికంగా ఉన్న పంటలు వేయవద్దని తక్కువ నీరు అవసరమున్న పంటలే సాగు చేయాలని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఈ సీజన్​లో 95 లక్షల నుంచి కోటి ఎకరాలు వరకు వివిధ రకాల పంటలు సాగు అంచనా వేస్తుంది.

గత వానాకాలంలో 131 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈసారి వర్షాభావ పరిస్థితులతో 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని భావిస్తోంది. ఈసారి సాగు అయ్యే దానిలో 45లక్షల ఎకరాలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు యూరియా కొరత ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. యాప్​ తీసుకరావడంతో బుకింగ్ ​చేసుకోవడం రైతులకు కష్టంగా మారింది. డిగ్రీ చదువుకున్న యువత కనిపిస్తే వారి ఇంటి వద్ద గంటల తరబడి వేచి చూసి యూరియా బుకింగ్​ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మంది రైతులు గతంలో కొనుగోలు చేసిన దానికంటే ఈసారి యూరియా వాడకం తగ్గిస్తున్నారు. పంట పండింతే చాలు అని అప్పలు చేయకుండా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆరు తడితోనే ఆదాయం..

రైతులు కూరగాయలు, పండ్లు, నువ్వలు, పొద్దు తిరుగుడు, కుసుమలు, శనగలు పంటలు వేస్తే అధిక ఆదాయం వస్తోందని ఉద్యాన శాఖ పేర్కొంటుంది. ఈ ఏడాది నుంచి మార్కెట్​సౌకర్యాలు మెరుగుపరుచుతున్నట్టు, చేనులో నుంచి తీసుకొచ్చి పంట అమ్మేందుకు ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటి వరకు రైతులు కూరగాయలు, పండ్లు మార్కెట్​కు తీసుకొచ్చినప్పడే ధరల పడిపోతాయి. అదే దళారులు కొనుగోలు చేసి సరుకులు రెండింతలు ధరల వస్తోంది. ఈసారి అలాంటి పరిస్ధితులు రాకుండా చర్యలు చేపడుతోంది.

ఈ వానాకాలంలో వ్యవసాయ శాఖ వేరుశనగ 26 వేల ఎకరాలు, నువ్వులు 650 ఎకరాలు, పొద్దు తిరుగుడు 150 ఎకరాలు, కుసుమలు 3,600 ఎకరాల్లో సాగు కావచ్చని గణాంకాలు వేస్తోంది. జొన్నలు 39 వేల ఎకరాలు, సజ్జలు 1200 ఎకరాల్లోనే సాగు అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. మొక్కజొన్న 5.40 లక్షల ఎకరాలు, కంది పంట 5.10 లక్షల ఎకరాల్లో వేయాలని టార్గెట్ పెట్టుకుంది. మిర్చి 1.90 లక్షల ఎకరాలు, సోయాబీన్​ 4.10 లక్షల ఎకరాలు, పెసర్లు 65 వేల ఎకరాలు. మినుములు 28 ఎకరాలు రైతులు సాగు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.

కౌలు రైతులు దూరం

ఈ ఏడాదిలో యూరియా ధరలు భారీగా పెరిగాయి. విత్తనాలు ధరలు భగ్గమంటున్నాయి. భూమి కలిగిన పట్టాదారులు ఏడాదికి చెల్లించే కౌలు కూడా పెంచారు. గత ఐదారేళ్లుగా కూలీల కొరత వేధిస్తోంది. ఇన్ని సమస్యల మధ్య భూమి కౌలుకు తీసుకోని అప్పులు చేసి పంట పండించడం కంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం ఉత్తమమనే ఆలోచనలో కౌలు రైతులు ఉన్నారు. రేవంత్​ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, క్రాప్ ​రుణాలు, ప్రకృత్తి విపత్తులకు నష్టం జరిగితే ఇప్పిస్తామని హమీ ఇవ్వడంతో వ్యవసాయానికి మొగ్గు చూపినట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి.

వరి పంట సాగు చేస్తే కౌలు, ఎరువులు, దుక్కులు దున్నడం, వరినాట్లకు కూలీలు, వరి కోత, కేంద్రాలకు ధాన్యం తరలింపు వంటి ఖర్చులు ఒక ఎకరానికి రూ. 60 వేలు వస్తుంది. అదే విధంగా పత్తి పంట సాగు చేస్తే కౌలు ధర ఎకరానికి రూ.20 వేలు, ట్రాక్టర్​తో దున్నకాలు రూ. 5వేలు, విత్తనాలు, కలుపు కూలీలకు రూ.6 వేలు, గింజలకు రూ. 2 వేలు, ఎరువులు చల్లే కూలీలకు రూ.6వేలు, రసాయనిక ఎరువులు రూ.10 వేలు, పురుగు మందులు రూ. 8 వేలు, పత్తి తీయడానికి రూ.15 వేలు ఇవే కాకుండా ఇతర ఖర్చులతో రూ.81 వేలు వస్తోందని అన్నదాతలు వెల్లడించారు.

Next Story