ఖమేనీ మృతి ఎఫెక్ట్.. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత టియర్ గ్యాస్ ఫైర్

by Malleboina Mahesh |

ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మృతికి నిరసనగా శ్రీనగర్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. కాశ్మీర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

ఖమేనీ మృతి ఎఫెక్ట్.. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత టియర్ గ్యాస్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడిలో (Air Attack) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతిపై ఆదివారం సాయంత్రం భారత దేశంలోని అనే ప్రాంతాల్లో భారీ నిరసనలు నిర్వహించారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఖమేని మృతిని నిరసిస్తూ శ్రీనగర్‌ (Srinagar)లో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేయడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీయర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ప్రజలు భారీగా గుమిగూడి ఆందోళనలు నిర్వహిస్తుండటంతో శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాశ్మీర్ వ్యాప్తంగా ఆంక్షలు - భద్రత కట్టుదిట్టం

భారత ప్రభుత్వం ఈ రోజు ఉదయం.. అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని, అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో స్థానిక పరిపాలన విభాగం కఠిన ఆంక్షలను విధించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి భద్రతా దళాలను భారీగా మొహరించారు. నిరసనలు హింసాత్మకంగా మారకుండా చూడటానికి పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్ సహా లోయలోని ప్రధాన పట్టణాలన్నీ పోలీసుల నిఘా నీడలో ఉన్నాయి.

Next Story