ఖమేనీ మృతి.. పాకిస్థాన్‌లో మిన్నంటిన నిరసనల్లో 22 మంది మృతి

by Malleboina Mahesh |

ఇరాన్ నేత ఖమేనీ మృతిపై పాకిస్థాన్‌లో మిన్నంటిన నిరసనలు. కరాచీ, ఇస్లామాబాద్‌లలో హింసాత్మక ఘర్షణలు.. 22 మంది మృతి. రంగంలోకి పాక్ ఆర్మీ!

ఖమేనీ మృతి.. పాకిస్థాన్‌లో మిన్నంటిన నిరసనల్లో 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ వార్త పాకిస్థాన్‌ను కుదిపేస్తోంది. ఖమేనీ మృతికి నిరసనగా పాక్‌లోని షియా సామాజిక వర్గం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 22 మంది మరణించగా, 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్, పెషావర్ వంటి ప్రధాన నగరాలు నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్నాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద నిరసనకారులు భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ప్రభుత్వానికి పెను సవాలుగా మారిన హింస

ఈ అకస్మాత్తు పరిణామాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఇరాన్‌తో ఉన్న మతపరమైన, దౌత్యపరమైన బంధం.. మరోవైపు అమెరికా ఆగ్రహానికి గురికాకూడదనే ఆందోళన మధ్య పాక్ ప్రభుత్వం నలిగిపోతోంది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వాడుతున్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దించింది. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతుండటంతో దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను అత్యంత కఠినతరం చేశారు.

అంతర్జాతీయ ఆందోళన - అమెరికా నిఘా..

పాకిస్థాన్‌లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దౌత్యవేత్తల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ హింసాత్మక ఘటనలు పాక్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్‌లో చెలరేగిన ఈ అస్థిరత అగ్రరాజ్యాలకు ఆందోళన కలిగిస్తోంది. అటు ఇరాన్ మద్దతుదారులు, ఇటు ప్రభుత్వ బలగాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఎప్పుడు సద్దుమణుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Next Story