ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్ కీలక ప్రకటన

by Muthe.Rajitha |

ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ వారసురాలిపై ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా తాజాగా కీలక ప్రకటన చేశారు.

ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ (Biocon) వారసురాలిపై ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా తాజాగా కీలక ప్రకటన చేశారు. తన మేనకోడలు క్లారీ (Claire) మజుందార్ బయోకాన్ బాధ్యతలను స్వీకరించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. మే 5న ఫార్చ్యూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. సంస్థ నాయకత్వ మార్పు కోసం ఒక పటిష్టమైన ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం, క్లారీ దశలవారీగా డైరెక్టర్ స్థాయి నుండి వైస్-చైర్, ఆపై చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడతారు. తాను ఇప్పుడప్పుడే పూర్తిగా రిటైర్ కావడం లేదని, బయోకాన్ వంటి భారీ సంస్థను అత్యంత సమర్థవంతమైన చేతుల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. క్లారీ కేవలం తన కోడలు కావడం వల్ల మాత్రమే కాకుండా, ఒక వ్యాపారవేత్తగా తనను తాను నిరూపించుకోవడం వల్లే ఈ అవకాశం దక్కిందని ఆమె కొనియాడారు. ఒక కంపెనీని ఎలా నడపాలో క్లారీ నిరూపించింది అని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 37 ఏళ్ల వయస్సున్న క్లారీ మజుందార్‌ ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీ (MIT), స్టాన్‌ఫోర్డ్ (Stanford) విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పొందింది. ఇప్పటికే Bicara Therapeutics అనే సంస్థకు ఫౌండర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బయోకాన్ ఇన్‌క్యుబేట్ చేసిన ఈ సంస్థ, నాస్‌డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవ్వడమే కాకుండా సుమారు 1.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉండటం విశేషం. బయోటెక్ రంగంలో క్లారీ సాధించిన ఈ అద్భుత విజయాలే ఆమెను బయోకాన్ వారసురాలిగా నిలబెట్టాయి. ఈ ప్రకటనతో మార్కెట్‌లో సానుకూల పవనాలు వీచాయి, బయోకాన్ షేర్లు కూడా పుంజుకున్నాయి. విదేశీ సంస్థను విజయవంతంగా నడిపిన అనుభవం ఉన్న క్లారీ నాయకత్వంలో బయోకాన్ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story