నేతల పనితీరుపై నిఘా!

by Ratna Kumari |

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతల పనితీరుపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో ఎలా భాగస్వామ్యం అవుతున్నారో పరిశీలిస్తున్నారు.

నేతల పనితీరుపై నిఘా!
X

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతల పనితీరుపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో ఎలా భాగస్వామ్యం అవుతున్నారో పరిశీలిస్తున్నారు. పథకాల అమలుతో పాటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు ఎలా నడిపిస్తున్నారో ఆరా తీయడంతో పాటు నివేదిక రూపంలో అందిస్తున్నారు. నిఘా వర్గాలే కాకుండా స్వతంత్ర ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా ప్రజాప్రతినిధులు, నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు ప్రజలకు దూరంగా ఉండే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవే కాకుండా ప్రజాప్రతినిధుల నేతల బంధువుల ఇన్వాల్మెంట్, ఇసుక, మట్టి అక్రమణ రవాణా, భూదందాల్లో వారి పాత్రపైన నివేదికల్లో పొందుపరుస్తున్నారు. ఏయే నేతలకు వీటితో సంబంధం ఉందో తెలుసుకోవడంతో పాటు పదవులు, ఇతర సమస్యలపై సీఎం వద్దకు వెళ్లినప్పుడు వీటిపై ఆరా తీయడంతో పాటు మందలిస్తుండడంతో కంగుతింటున్నారు. ఎప్పటికప్పుడు నిఘా కొనసాగుతుండటంతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల పనితీరుపై నివేదికలు పంపిస్తుండటంతో కీలక శాఖల్లో పనిచేస్తున్నవారు ఉలిక్కిపడుతున్నారు.

నేతలపై పెరిగిన నిఘా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12మంది ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పది మంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుండగా ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటిపోయింది. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం, గెలిచిన నేతలు కొంతకాలం ఇష్టం వచ్చినట్లుగా ఉండటం, అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడం, ప్రజలకు దూరంగా ఉండటంతో నిఘా పెరిగింది. వారి పనితీరుపై నిఘా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడంతో పాటు ఏయే నియోజకవర్గాల్లో అసమ్మతి ఉందో పరిశీలిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేస్తూనే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసమ్మత్తులపై దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎంపికైన ఎమ్మెల్యేల పనితీరు అనుకున్నంతగా లేకపోవడంతో గడిచిన కొన్ని నెలలుగా ఎక్కడికక్కడ నివేదికలు తెప్పించుకుంటున్నారు.

సీఎం ఆధ్వర్యంలో వాటిని పరిశీలించడంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, పీసీసీ అధ్యక్షుడు మంత్రుల సమక్షంలో చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. పనిచేయని వారిని మందలించడంతో పాటు అసమ్మతి ఉన్నచోట నేతల మధ్య సమస్యలను సర్దుమణిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలోని నేతల మధ్య సమన్వయం లేదు. నివేదికల ఆధారంగా ఈ విషయాలపైన ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య కూడా సమన్వయం లేదు. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కొడుకులు, కూతుర్లు, అల్లులు, కోడళ్లు, అత్తలు, మామలు, తమ్ముళ్లు, కుటుంబ బంధువులు, పీఏలు డామినేట్ చేస్తున్నారు. వీరి ధాటికి తట్టుకోలేక

సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతల పెత్తనం పెరిగింది. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఎక్కువగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపుపైన ప్రజాప్రతినిధుల బంధువులపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో భూ అక్రమాలకు నేతల బంధువులు కొమ్ము కాస్తున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వస్తున్నాయి. లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇసుక, మట్టి అక్రమ రవాణా లో ప్రజాప్రతినిధుల బంధువులు భారీగా వసూళ్లు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఒక ప్రజాప్రతినిధి భూముల సెటిల్మెంట్లు వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. తమ బంధువుల పదవికోసం వెళ్లినప్పుడు ఈ వ్యవహారంపై నిలదీసినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లు పూర్తికావడం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను ఉమ్మడి జిల్లాలో ఖర్చు చేస్తున్నా తగిన ఆదరణ రాకపోవడంతో నిఘా వర్గాలతో పాటు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నివేదికలను నెలనెలా పంపిస్తుండటంతో సమీక్ష సమయంలో ఆయా నేతలను సీఎంతో పాటు మంత్రులు మందలిస్తున్నట్లు తెలిసింది. కొంత మంది ఉమ్మడి జిల్లా నేతలు పదవుల కోసం సీఎంను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఈ విషయాలను దృష్టికి తేవడంతో నేతలు కంగుతిన్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో మమేకమయ్యే నేతలు పథకాల అమలుతీరుకు సహకరించే నేతలకే ఈ దఫా పదవులు నిఘా వర్గాల నివేదికతో పాటు ప్రైవేటు ఏజెన్సీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఇవ్వనుండటంతో నేతలు కంగుతింటున్నారు.

వరంగల్ లో భూముల వ్యవహారం..

వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలో గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్న సంఘటనలు, కుడా భూముల వేలం వ్యవహారం, కాజీపేటలో పార్సీ భూముల అమ్మకాలపై ఆరోపణలు, వడ్డేపల్లిలో బతుకమ్మ కుంట భూముల కబ్జా, ఏనుమాముల మార్కెట్ సమీపంలో భూముల కబ్జాపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. సీఎం కూడా ఒకరిద్దరు నేతలపై ఈ వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పనితీరును మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తుంది. జనగామ జిల్లా పరిధిలో రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ వివాదాలు , ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందుబాటులో ఉండక ఇతర ప్రాంతాల్లో ఉండటం పై నివేదికలు ఇవ్వడంతో హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది.

అధికారుల‌ పనితీరుపై ఆరా..

ఉమ్మడి జిల్లాలోని అధికారుల పనితీరుపైన ఆరా తీస్తున్నారు. ఆరు జిల్లాల పరిధిలో ఏయే అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారో ఎవరు నామమాత్రంగా ఉంటున్నారో కీలకమైన జిల్లా అధికారుల పనితీరుపైన సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. నెలలవారీగా నివేదికలు ఇస్తుండటంతో అధికారుల్లో కూడా అప్రమత్తం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కీలకమైన శాఖల అధికారులను బదిలీ చేశారు. కొంత మంది నేతల సిఫారసు ద్వారా వచ్చిన వారికి కూడా పై నుంచి అక్షింతలు నివేదికల ఆధారంగా పడుతుండటంతో ఉలిక్కి పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మరో రెండేళ్లు కీలకం కావడం ఉన్న స్థానాలను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో గ్రామస్థాయి నుంచి ఈ నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. నివేదికల ఆధారంగా ఎవరికి పదవులు వస్తాయో ఎవరి పదవులు ఊడుతాయో త్వరలోనే తేలనుంది.

Next Story