సిట్ నోటీసులపై KCR అభ్యంతరం.. జూబ్లీహిల్స్‌ ఏసీపీకి సంచలన లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-31 12:31:54  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.

సిట్ నోటీసులపై KCR అభ్యంతరం.. జూబ్లీహిల్స్‌ ఏసీపీకి సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రెండోసారి సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. మాకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. నోటీసు ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడలకు నోటీసులు అంటించడం ఏంటి. ఇది సరైన పద్దతి కాదు. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నా విచారణకు సహకరిస్తా. రేపు నందినగర్‌ నివాసంలో విచారణకు హాజరవుతా అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

ఇకనుంచి వచ్చే నోటీసులన్నీ ఎర్రవల్లికే రావాలి

65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని ఈ సందర్భంగా సిట్ అధికారులకు కేసీఆర్ చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదనీ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ‘నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోంది. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తా. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధం. నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటా. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చు. కానీ నేను ఆపని చేయడం లేదు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచన చేస్తున్నాను. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అని లేఖలో కేసీఆర్ ఆవేదన చెందారు. అంతేకాదు.. ఏపీ హైకోర్టులోని 'వీడీ మూర్తి' కేసు తీర్పును లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.

Next Story