- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురిపించిన హిమగిరి సొగసులు!
ఎన్ని వింతలు! ఎన్ని విశేషాలు! ఎన్ని సాహసాలు! మా కాశీ–అయోధ్య–నేపాల్ యాత్ర.

ఎన్ని వింతలు! ఎన్ని విశేషాలు! ఎన్ని సాహసాలు! మా కాశీ–అయోధ్య–నేపాల్ యాత్ర. ఉత్తర భారతదేశంలోని చారిత్రక నగరాలు, నేపాల్‌లోని హిమాలయ సానువుల్లోని ప్రాంతాలు, అక్కడి ప్రకృతి అందాలు, పర్వత మార్గాలు, సరస్సులు, సాహస యాత్రలు, అక్కడి విభిన్న సంస్కృతులు. ఒకటా, రెండా, ఆ అనుభూతులు, అనుభవాలు జీవితంలో మరచిపోని మందహాసాలు. పది మంది సభ్యులు కల మా బృందం తిరుపతి నుంచి బయలుదేరింది. గూడూరు చేరుకుని అక్కడి నుంచి రైలు మార్గంలో ఉత్తర భారతదేశ యాత్ర మొదలుపెట్టిందిలా. మా బృందంలో నేను(మల్లారపు నాగార్జున) నా జీవిత భాగస్వామి వసంత, దామోదర రెడ్డి-ధనమ్మ దంపతులు, గోపాల్–భారతి దంపతులతో పాటు మిత్రులు రెడ్డెప్ప నాయుడు, నరసింహులు, పద్మావతి, అమ్ములు ఉన్నారు.
కాశీ - మతసామరస్యానికి ప్రతీక
గూడూరులో జూన్ 9న రైలులో బయలుదేరిన మేం, జూన్ 11 ఉదయం అలహాబాద్ చేరుకున్నాం. త్రివేణి సంగమం, నెహ్రూ మ్యూజియం సందర్శన అనంతరం టెంపోలో వారణాసి చేరుకున్నాం. గంగానది పరివాహక ప్రాంతం.. వేల సంవత్సరాల చరిత్రను తన కడుపులో మోస్తున్న వారణాసి నగరం ప్రాచీన భారతీయ సంప్రదాయాల ఆనవాళ్లు నిలుపుకున్న వారణిసి, అదే కాశీ నగరం. సన్నని ఇరుకిరుకు వీధులు, స్నానఘట్టాలు, పురాతన నిర్మాణాలు, సాయంత్రపు గంగా హారతి, సారనాథ్ బౌద్ద స్థూపం మమ్మల్ని విశేషంగా ఆకర్షించాయి. నగరంలో అపురూపమైన కళలు, ఆహారపు అలవాట్లు, భిన్నమైన సంప్రదాయాలు ఉత్తర భారత జీవన విధానాన్ని, భిన్నమైన అక్కడి సంస్కృతిని మనకు దగ్గరగా పరిచయం చేశాయి. కాశీలోని విశ్వేశ్వరుని ఆలయం, ఆ పక్కనే చారిత్రక జ్ఞానవాపి మసీదు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. నేటి దేశ రాజకీయ, సామాజిక, చారిత్రక చర్చల్లో అవి తరచూ తొంగి చూస్తూనే ఉన్నాయి. ఆలయ–మసీదు నిర్మాణ శైలులు, పురాతన కట్టడాల ఆనవాళ్లు కాశీ నగరానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
చరిత్రలో చెరిగిపోని అయోధ్య
దేశవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా చర్చనీయాంశ మవుతున్న అయోధ్య నగరానికి జూన్ 13న చేరుకున్నాం. బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదం దశాబ్దాల పాటు దేశాన్ని కుదిపేసింది. బాబ్రి మసీదు ప్రాంతంలో నిర్మించిన రామాలయం అనేక మానని గాయాలను తనలో దాచుకుని ఇప్పుడు దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా పైకి మురిసిపోతోంది. అయోధ్యలో కొత్తగా అభివృద్ధి చేసిన రహదారులు, ఘాట్లు, నిర్మాణాలు నగరానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. ప్రశాంత వాతావరణంలో సరయూ నది తీర ప్రాంతం. సాయంత్రం అయోధ్య నుండి ఘోరక్ పూర్ కు రైల్లో బయుదేరాం.
ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం పొఖారా
గోరఖ్‌పూర్ ఘోరక్ నాథ్ ఆలయం సందర్శన అనంతరం జూన్ 14న వ్యాన్ లో నేపాల్ చేరుకున్నాం. నేపాల్‌లోని ప్రముఖ పర్యాటక నగరమైన పొఖారా హిమాలయాల ఒడిలో ఓలలాడుతోంది. సరస్సులు, మంచుతో నిండిన పర్వతాలు, లోయలు, జలపాతాల మధ్య ఉన్న ఈ నగరం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. బింద్యవాసిని ఆలయం, సెతి నది, మహేంద్ర గుహ, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ గుహ వంటి ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణలు. ఫేవా సరస్సులో చేసిన పడవ విహారం మా యాత్రలో మరపురాని ఘట్టం. సరస్సులో అద్భుతంగా ప్రతిబింబించిన అన్నపూర్ణ పర్వత శ్రేణులను చూస్తూ మైమరచిపోయాం. గూర్ఖా మ్యూజియం చాలా ఆసక్తికరంగా ఉంది. గూర్ఖా యోధుల చరిత్ర, ప్రపంచ యుద్ధాల్లో వారి పాత్ర, ఆయుధాలు, ఫోటోలతో నేపాల్ సైనిక సంప్రదాయాన్ని ఈ మ్యూజియం మాకు పరిచయం చేసింది.
ముక్తినాథ్ - సాహస యాత్ర
పొఖారా నుంచి జూన్ 16న జొంసం మీదుగా ముక్తినాథ్ ప్రయాణం ప్రారంభమైంది. ఇది యాత్రలో అత్యంత సాహసోపేతమైంది. గండకి నదిలో సాలగ్రామాల కోసం వెదుకుతున్న పర్యాటకులు, గండకీనది పక్కన సాగిన పర్వత మార్గాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. సముద్ర మట్టానికి సుమారు 12,500 అడుగుల ఎత్తులో ఉన్న ముక్తినాథ్ ప్రాంతానికి చేరుకోవడం సాహసంతో కూడుకున్న అనుభవం. ప్రాణవాయువు తగ్గిపోవడం, శీతల వాతావరణం, కఠినమైన మార్గాలు కొంత ఇబ్బంది కలిగించినా, హిమాలయాల మధ్య ప్రయాణం అసాధారణ అనుభూతిని మిగిల్చింది. గుర్రాలపై ప్రయాణించడం చాలా ఉత్కంఠభరితం. ఒకవైపు మంచుతో కప్పుకున్న పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు ; ఓహ్ ... మనసును మంత్రించేసింది ఆ ప్రకృతి. నిర్మానుష్యమైన జొంసం ప్రాంతంలోని పర్వత ప్రాంతాలు, గాలుల తీవ్రత, ఎత్తైన కొండల మధ్య ఉన్న చిన్న చిన్న గ్రామాలు; ఆ హిమాలయ జీవన విధానాన్ని ప్రత్యక్షంగా మాకు చూపించాయి.
హిమాలయ మార్గంలోనే తిరుగు ప్రయాణం
జొంసం నుంచి జూన్ 17న రోడ్డు మార్గంలో తిరిగి పొఖారా చేరుకున్నాం. మార్గమంతా కనిపించిన హిమాలయ పర్వత శ్రేణులు, గండకి నది ప్రవాహం, జలపాతాలు, కొండల్లో ఉండే గ్రామాలు చూస్తుంటే, మా ప్రయాణాన్నిఅలుపు లేకుండా ఆహ్లాద భరితం చేశాయి.
మనోకామన రోప్‌వే – ఆకాశయానం అనుభూతి
పొఖారా నుంచి ఖాట్మండు ప్రయాణంలో మనోకామన ప్రాంతాన్ని సందర్శించాం. కొండపైకి రోప్‌వేలో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతి. పై నుంచి కనిపించిన పర్వతాలు, నదులు, పచ్చని అడవులు అన్నీ కలిసి ఒక మహాద్భుత ప్రకృతి చిత్రపటం.
భిన్న సంస్కృతుల సంగమం ఖాట్మండు
నేపాల్ రాజధాని ఖాట్మండు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల కలయికగా నిలుస్తోంది. పశుపతినాథ్ ఆలయం, బౌద్ధ స్థూపాలు, పురాతన వీధులు, మార్కెట్లు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వయంభూనాథ్ కొండపై నుంచి ఖాట్మండు నగరాన్నంతా వీక్షించవచ్చు. నగరంలోని పురాతన నిర్మాణాలు, నేపాలీ సంస్కృతి, స్థానిక ఆహార్యాలు కన్నార్పకుండా చూడాల్సినవే.
లుంబినీ – ప్రశాంతతకు నిలయం
ఖాట్మండు నుంచి జూన్ 20న తిరుగు ప్రయాణంలో లుంబినీని సందర్శించాం. బుద్ధుని జన్మస్థలంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది. వివిధ దేశాలు నిర్మించిన బౌద్ధ స్థూపాలు, విహారాలు, ఉద్యానవనాలు లుంబినీకి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. థాయ్‌లాండ్, జపాన్, చైనా, మయన్మార్ తదితర దేశాల నిర్మాణ శైలిలో నిర్మించిన బౌద్ధ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రశాంత వాతావరణంలో తెల్లని స్థూపాలు, విస్తారమైన ఉద్యానవనాలు ఆహ్లాదానుభూతిని కలిగిస్తాయి. లుంబినీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు భారత్ సరిహద్దు ఇక 11 కిలోమీటర్లు ఉందనగా మేం ప్రయాణిస్తున్న వాహనం మొరాయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో గోరఖ్‌పూర్ చేరుకుని, జూన్ 21 ఉదయం రైలులో తిరుగు ప్రయాణమయ్యాం. జూన్ 22 రాత్రికి గూడూరు చేరుకున్నాం. పద్నాలుగు రోజుల యాత్ర ముగించుకుని వస్తున్న మా కోసం మా మిత్రుడు మురళీ గోపాల్ తిరుపతి నుంచి ప్రత్యేకంగా ఇంటి భోజనం తీసుకొచ్చారు. గూడూరు టోల్ గేట్ వద్ద అందరం కలిసి భోజనం చేయడం మరో మంచి జ్ఞాపకంగా నిలిచిపోయింది. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నాం.
పదిలంగా జ్ఞాపకాలు
ఈ పర్యటన మాకు కేవలం కొత్త ప్రాంతాలను చూపించడమే కాదు; భారతీయ చరిత్ర, నేపాలీ సంస్కృతి, హిమాలయాల ప్రకృతి వైభవం, పర్వత జీవన శైలి, సాహస యాత్ర అనుభూతిని దగ్గరగా పరిచయం చేసింది. హిమాలయాల మంచు శిఖరాలు, ఫేవా సరస్సులో బోటు విహారం, ముక్తినాథ్ పర్వత మార్గాలు, ఖాట్మండు వీధులు, లుంబినీ ప్రశాంతత, మిత్రులతో గడిపిన ఆనంద క్షణాలు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఒక కొత్త ప్రాంతానికి వెళ్లి రావడం అంటే, ఆ ప్రాంతం మనకు ఇచ్చే కొత్త అనుభవాలను, కొత్త ఆలోచనలను మనసులో నిక్షిప్తం చేసుకోవడం. తిరిగి వచ్చాక ఆ అనుభూతులను పదుగురితో ఇదిగో ఇలా పంచుకోవడం.
-మల్లారపు నాగార్జున, తిరుపతి.
మొబైల్: 9398000686.






