జపాన్ .. ఒసాకా నగరం - 1

by Muthe.Rajitha |

నేను ఇప్పట్లో జపాన్ వెళ్ళాలని అనుకోలేదు. అది చెర్రీ పూల సీజన్ కావడం వల్ల పిల్లలు తప్పకుండా వెళ్ళమని ప్రోత్సహిoచారు.

జపాన్ .. ఒసాకా నగరం - 1
X

నేను ఇప్పట్లో జపాన్ వెళ్ళాలని అనుకోలేదు. అనుకోకుండా కలిసి వచ్చింది. అది చెర్రీ పూల సీజన్ కావడం వల్ల పిల్లలు తప్పకుండా వెళ్ళమని ప్రోత్సహిoచారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆ సమయంలో సందర్శిస్తారు. అందువల్ల హోటల్, విమాన ఖర్చులు కూడా ఇతర సమయాల కంటే దాదాపు అరవై, డెబ్భై వేలు ఎక్కువగానే అయింది. వీసా ప్రొసీజర్ కూడా నేను వెళ్ళిన ఇతర దేశాలకంటే కఠినంగా ఉంది. మూడు నాలుగు వారాల ముందే వీసాకు దరఖాస్తు పెట్టాలన్నారు. అందుకు గాను పాస్ పోర్ట్ కూడా జపాన్ ఎంబసీకి పంపించాలి. ఈ విషయం నాకు తెలియక పోవడం వల్ల, నేను కంబోడియా ట్రిప్ బుక్ చేసుకొని ఉండడం వల్ల నాకు అందరితోపాటు అంత ముందుగా అప్లై చేసుకోలేక పోయాను. నేను కంబోడియా నుంచి తిరిగి వచ్చాక అంటే రెండు వారాల ముందు వీసాకు అప్లై చేసాను. సమయం తక్కువగా ఉంది. వీసా వస్తుందో రాదోనన్న సందేహం. ఎట్టకేలకు సమయానికి జపాన్ వీసా అందింది.

మధ్య రాత్రి ఒంటిగంటకు మా ఫ్లైట్. సింగపూర్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణం. రాత్రి పదిన్నర వరకు ఒక్కొక్కరుగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. ఐదుగురo.. ఎవరికీ ఎవరూ అంతదాకా పరిచయం లేదు. అక్కడే మొదటిసారి కలిశాం. అందులో సురేఖ ఉగాండా దేశం నుంచి వచ్చిందట. మరో ముగ్గురు థాయ్ ఎయిర్ లైన్స్ వస్తున్నారని తెలిసింది. ఉదయం 5,6 గంటలకు సింగపూర్ లో దిగిపోయాం. మధ్యలో రెండుగంటల విరామం. ఆగమేఘాలమీద సెక్యూరిటీ చెక్ ముగించుకొని గేట్ దగ్గరకి చేరుకున్నాం.

జపాన్ లోని ఒసాకా నగరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నమైంది. జపాన్ ఇమ్మిగ్రేషన్ కష్టతరంమైందని కథలు కథలుగా చెప్పారు. చాలా జనం ఉంటారని, చాలా సమయం పడుతుందని తెలిసింది. QR కోడ్ సేవ్ చేసుకొని అక్కడ స్కాన్ చేయాలని చెప్పారు. యుట్యూబ్ వీడియోలు అయితే మరీ భయపెట్టాయి. నా అనుభవం మా మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వుంది. ఇమ్మిగ్రేషన్ కొరకు చాలా కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యూలో జనాన్ని పంపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సుమారు పాతికేళ్ళ లోపు అమ్మాయిలే కనిపించారు. కౌంటర్ దగ్గరకు చేరు కోవడానికి పదినిమిషాలైతే.. అక్కడ రెండే నిమిషాలలో పని అయి పోయింది. కౌంటర్లో ఉన్న అమ్మాయి నవ్వుతూ స్వాగతం చెప్పింది. నా ఫోన్ లో పెట్టుకున్న తిరుగు ప్రయాణం టికెట్, జపాన్ లో బసచేసే హోటళ్ళ వివరాలు ఫోన్ లోనే చూపించాను. అంతే.. ఎంజాయ్ అంటూ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసేసింది.

లగేజీ తీసుకొని, అందరం కలుసుకున్నాo. అప్పటికే గైడ్ మా కొరకు ఎదురుచూస్తున్నాడు. పరిచయాల అనంతరం మా కోసం ఏర్పాటు చేసిన మినీ బస్ ఎక్కాం. ఒసాకా నగరాన్ని చూస్తూ కిటికీ పక్కన కూర్చున్నాను. మార్గమధ్యoలో భోజనం ముగించి హోటల్ కు చేరుకునే సరికి సుమారు సాయంత్రం 4,5 గంటలైంది. జపాన్ భారత కాలమానం కంటే మూడున్నర గంటలు ముందుంది. ఇండియాలో ఉదయం ఆరు గంట లైతే జపాన్ లో ఉదయం తొమ్మిదిన్నర అన్నమాట. మేం చేరుకున్నది జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం. విశ్రాంతి తీసుకోమన్నారు.వెళ్ళిందే తిరగడానికి కదా..ఒక గంటలో రోడ్డున పడ్డాం.. సన్నగా వర్షం పడుతోంది. నలుగురం టాక్సీ ఎక్కి దోటన్ బోరి స్ట్రీట్ కు చేరుకున్నాం. పది పదిహేను నిమిషాల్లో అక్కడ దిగిపోయాం. టాక్సీకి 4000 యెన్స్ అయింది.

ఇది ఒసాకా నైట్ లైఫ్, ఫుడ్ కు ఇది గుండెకాయ లాంటిది. 'కుయిడావోరే ' అనే ఆహార పదార్థం అక్కడ చాలా ప్రఖ్యాతి. దీని వల్లనే జపాన్‌కు ' జపాన్ కిచెన్ ' అనే పేరు వచ్చిందని గైడ్ ఆకాశ్ చెప్పాడు. అది మాంసాహారం. ఇంకా చాలా హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి. మనమే మిషన్లో కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని వస్తే అదే మనకు సర్వ్ చేస్తారు. రేఖ అలా తనకు కావలసిన ఆహారాన్ని తిన్నది. వెయ్యి యెన్లు బిల్ అయింది. మనం చేసుకున్న కాంబినేషన్ ను బట్టి ధర ఉంటుంది. చీజ్ కేక్ శాకాహారంలో ప్రత్యేకమని చెప్పడం వల్ల నేను అది తిన్నాను. చాలా రుచిగా ఉంది. జపాన్ లో మరెక్కడా అదినాకు లభించ లేదు. 500 యెన్స్ బిల్ అయింది.

ఎబిసుబాషి బ్రిడ్జి మీద 33 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన LED బోర్డు. దానిలో కనిపించే నీలి ట్రాక్ మీద చేతులు పైకెత్తి పరుగు పెడుతున్న మనిషి. తెరలోనుంచి దూసుకు వస్తున్న పిల్లి. ఇది ఒసాకా సింబల్. వీటిని చూడడానికి జనం అక్కడ వేచి వుంటారు. ఫోటోలు తీసు కుంటారు. ఎటుచూసినా భారీ నియాన్ సైన్ బోర్డులతో, లైట్లతో అదో వింత ప్రపంచం లాగా ఉంటుంది. షింబైబాషి షాపింగ్ స్ట్రీట్ ఉంది. రాజ్, నేను అక్కడ చిన్న క్యాబిన్ సూట్ కేస్ కొన్నాం. లెదర్ షూ, బట్టలు శిల్ప కొన్నది. మెయిన్ రోడ్డునుంచి సన్నని సందులోకి వెళితే.. హోజెన్జీ యొకొచో వీధి వస్తుంది. లాంతర్లు, రాళ్ళ రోడ్డు, తక్కువ జనం, ట్రెడిషనల్ బార్లతో పాత ఒసాకా నగరంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. జపాన్ సంస్కృతి తెలుస్తుంది. దోటన్ బోరీ రివర్ క్రూయిజ్ కూడా అందుబాటులో ఉంది. రుసుం 1200 యెన్లు. చికాగో కల్చరల్ క్రూయిజ్ టూర్ చేసి ఉన్నందువల్ల నాకు దాని పట్ల పెద్దగా ఆసక్తి కలుగలేదు. ఆ ప్రదేశమంతా తిరిగి మళ్ళీ టాక్సీ చేసుకొని హోటల్ గదికి చేరేసరికి రాత్రి పదకొండున్నర అయింది.

రెండో రోజు మేం ఒసాకా క్యాసెల్ కు వెళ్ళాం. ఇది ఒకప్పుడు జపాన్ లోనే అతి పెద్ద కోట. ఇప్పుడు ఒసాకా సిటీ సింబల్ గా చెపుతారు. జపాన్ అందర్యుద్ధాల తర్వాత దేశాన్ని ఏకం చేయాలనే టొయోటోమీ వీడియోషి తన కలను సాకారం చేసుకున్న దానికి గుర్తుగా దానిని 1583 లో నిర్మించాడని చరిత్ర చెపుతోంది. యుద్ధాలవల్ల, ఆ తర్వాత కూడా శిథిలమైంది. కాలిపోయింది. ప్రస్తుతం ఉన్నది 1931 నాటి నిర్మాణం. ప్రవేశ రుసుం పెద్దలకు 1200, పిల్లలకు 600 యెన్లు. ఇక్కడ ఎనిమిది అంతస్తుల టవర్ మ్యూజియం ప్రత్యేకమైంది. ఐదో అంతస్తువరకు మాత్రమే లిఫ్ట్ సౌకర్యం ఉంది. బయట లిఫ్ట్ కొరకు ఉన్న క్యూను చూసి నేను, రేఖ మెట్లగుండా పైకి వెళ్ళిపోయాం. ఒసాకా క్యాసెల్ చరిత్ర, సమురాయ్ కత్తులు, కవచాలు, ఆనాటి డాక్యుమెంట్స్, 3 D డిసిప్లేలు ఉన్నాయి. సమురాయ్ కాస్ట్యూoతో ఫోటో కూడా తీసుకోవచ్చు. ఒక్కరికి 500 యెన్స్. నేను, రేఖ, భ్రమర తీయించుకున్నాం. మొత్తం తిరిగి చూడడానికి మాకు సుమారు మూడు, నాలుగు గంటల సమయం పట్టింది.

మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఉమేదా స్కై బిల్డింగ్‌కు వెళ్ళాం. అది ఒసాకా నగరం ప్రత్యేకతను చాటుతుంది. ప్రవేశ రుసుం పెద్దలకు 1800, పిల్లలకు 700 యెన్స్. దీనిని హీరోషి హరా అనే శిల్పి 1993 మార్చి 25 న పూర్తి చేసినట్లు రికార్డులు చెపుతున్నాయి. ఎత్తు 557 అడుగులు. 40 అంతస్తుల రెండు టవర్లను గ్లాస్ బ్రిడ్జితో కలిపారు. అక్కడ "ఫ్లోటింగ్ గార్డెన్ ఓపెన్ ఎయిర్ అబ్జర్వేటరీ "ఉంది. 173 మీటర్ల ఎత్తునుంచి ఒసాకా నగరం మొత్తం 360 డిగ్రీలలో కనిపిస్తుంది. అక్కడినుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభూతి. రెండు టవర్ల మధ్య గ్లాస్ ఎస్కలేటర్లో వెళ్ళడం కూడా గొప్ప అనుభవం. భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఓపెన్ ఎయిర్లో రూఫ్ పైన ల్యూమినస్ రాళ్ళతో మెరిసే నేల మధురమైన రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది. అందుకే అక్కడ జంటలు లాక్ చేసిన వేలాది లాక్స్ ఉన్నాయి. ప్రేమ ఫలించడానికి అలా చేస్తారట. అది వాళ్ళ నమ్మకం.

గిరిజ పైడిమర్రి

ట్రావెలర్

99494 43414

Next Story