రాష్ట్రంలో 100 మంది ప్రముఖులకు సెక్యూరిటీ కట్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ప్రముఖులకు కల్పించే భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 100 మంది ప్రముఖులకు సెక్యూరిటీ కట్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రముఖులకు కల్పించే భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన దాదాపు 100 మంది ప్రముఖుల భద్రతను సర్కార్ భారీగా తగ్గించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం, వారి కదలికలు గణనీయంగా తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ప్రభుత్వం పేర్కొంది. మారిన పరిస్థితులు, ఇంటెలిజెన్స్ వర్గాల ముప్పు అంచనా నివేదికల ఆధారంగా ఈ భద్రతా సమీక్షను నిర్వహించి నిబంధనలను సవరించింది.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, గన్ మెన్ల ఉపసంహరణ

ఈ కొత్త నిర్ణయం ప్రకారం.. భద్రతను తగ్గించిన ప్రముఖులలో కొందరికి గతంలో ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక వాహనాలను, వ్యక్తిగత గన్‌మెన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వన్ ప్లస్ వన్ (1+1) రక్షణను పూర్తిగా తొలగించడమే కాకుండా, ఎక్కువ ముప్పు ఉన్న వారికి ఇచ్చే టు ప్లస్ టు (2+2) కేటగిరీ భద్రతా సిబ్బందిని కూడా ఒకరికి కుదిస్తూ పరిమితులు విధించారు.

జులై 1 నుంచి కొత్త ఉత్తర్వులు అమలు

ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా అధికారిక ఉత్తర్వులు రాబోయే జులై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. కాగా, గతంలో ఉన్న మావోయిస్టుల బెదిరింపులు, పాత కక్షలు, విధి నిర్వహణలో ఎదురైన వివిధ భద్రతా కారణాల చేత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు సహా మొత్తం 600 మంది ప్రముఖులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద సెక్యూరిటీని కల్పిస్తోంది. అయితే, తాజా సమీక్షతో వంద మందికి పైగా ప్రముఖుల భద్రతలో మార్పులు చేర్పులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story