ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్లకు రూ.100 కోట్లకు పైగా లంచం

by Muthe.Rajitha |

ప్రయివేట్ స్కూల్స్ కు పర్మిషన్లు ఇప్పిస్తానని ఏకంగా రూ.100 కోట్ల లంచం తీసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్లకు రూ.100 కోట్లకు పైగా లంచం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రైవేట్ స్కూల్స్ కు ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి, వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు బి.టి. అరసకుమార్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి ఇళంగోవన్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. చెన్నై టీనగర్ కేంద్రంగా సాగిన ఈ వసూళ్ల దందాపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపారు.

అధికారుల అండదండలతో మోసం

బాధితుడు ఇళంగోవన్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అరసకుమార్ తనకు ఉన్న రాజకీయ, అధికారిక పలుకుబడిని ఉపయోగించి పాఠశాలలకు అవసరమైన చట్టపరమైన అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికారు. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు (Recognition), గ్రేడ్‌ల ఉన్నతీకరణ (Upgradation) లతో పాటు, భవన నిర్మాణాలకు సంబంధించిన సీఎండీఏ (CMDA), డీటీసీపీ (DTCP) క్లియరెన్సులు వంటి కీలక అనుమతులు సులభంగా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.వ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుండి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు.

విద్యాశాఖలో తీవ్ర కలకలం

అయితే, పాఠశాలల యాజమాన్యాల నుండి సుమారు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ, అరసకుమార్ చెప్పిన విధంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు ఇప్పించలేదు. పైగా, గడువు ముగిసినా తీసుకున్న భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా పాఠశాలల నిర్వాహకులను తిప్పించుకుంటూ మోసగించారు. ఈ మోసంపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యాసంస్థల అనుమతుల పేరిట ఇంత భారీ స్థాయిలో అవినీతి, మోసం జరగడం మరియు ఒక ప్రముఖ సంఘం అధ్యక్షుడే అరెస్ట్ కావడం తమిళనాడులోని విద్యా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Next Story