- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి రైతుల డిజిటల్ కష్టాలు.. ఉదయం 6 గంటలకే చేతిలో ఫోన్ క్షణం ఆలస్యమైతే అంతే సంగతి!
రైతన్నకు కష్టాలు కొత్త కావు.. కానీ ఈసారి వచ్చిన కష్టం మాత్రం విచిత్రమైనది, అంతకంటే దారుణమైనది.

దిశ,తాడ్వాయి: రైతన్నకు కష్టాలు కొత్త కావు.. కానీ ఈసారి వచ్చిన కష్టం మాత్రం విచిత్రమైనది, అంతకంటే దారుణమైనది. ఒకవైపు ఆకాశం వైపు చూస్తూ విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న కామారెడ్డి జిల్లా రైతులకు.. ఇప్పుడు పొలం పనుల కంటే, తెల్లవారుజామునే స్మార్ట్‌ఫోన్లలో వేళ్లు ఆడించడమే పెద్ద పరీక్షగా మారింది. జిల్లావ్యాప్తంగా యూరియా దొరకడం ఇప్పుడు కత్తి మీద సాముగా మారింది. పొలాల్లో నాగలి పట్టాల్సిన చేతులు.. యూరియా బుకింగ్ కోసం తెల్లారకముందే ఫోన్లు పట్టుకుని యుద్ధం చేయాల్సి వస్తోంది.
ఆరు దాటితే.. ఆశలు వదులుకోవాల్సిందే!
ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ బుకింగ్ విధానం లక్ష్యం గొప్పగా ఉన్నప్పటికీ జిల్లాలోని రైతులకు చుక్కలు చూపిస్తోంది. ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 6 గంటలకు బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ సమయానికి నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండి,అదృష్టం కలిసి వస్తేనే బుకింగ్ అవుతుంది. కనురెప్ప మూసి తెరిచేలోగా, సెకన్ల వ్యవధిలోనే 'స్టాక్ అయిపోయింది’ అంటూ స్క్రీన్‌పై మెసేజ్ దర్శనమిస్తోంది. ఉదయం 6:05 గంటలకు లాగిన్ అయినా లాభం లేని పరిస్థితి. దీంతో రైతులు తెల్లవారుజామున నిద్రలేచి, ఎక్కడ సిగ్నల్ వస్తుందో వెతుక్కుంటూ రోడ్లపైకి, రచ్చబండ దగ్గరకు పరుగులు తీస్తున్నారు.
రెండు బస్తాల కోసం ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి పరుగులు..
జిల్లాలోని ఏదో ఒక మండలంలో లేదా మారుమూల గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులోనో, సొసైటీలోనే యూరియా నిల్వలు ఉన్నట్లు యాప్‌లో చూపిస్తే రైతులు చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారు. కేవలం రెండు బస్తాల యూరియా కొరకు.. అదృష్టం కలిసి వచ్చి ఎక్కడో దూరంగా ఉండే సెంటర్లలో బుక్ అయితే, అంత దూరం ప్రయాణించి, రవాణా చార్జీలు భరించి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. స్థానికంగా ఎరువులు దొరకకపోతే పక్క మండలాల చుట్టూ అయిన తిరగాల్సి రావడంతో చిన్న, సన్నకారు రైతుల సమయం, డబ్బు వృధా అవుతున్నాయి.
యాప్‌లు మాకొద్దు బాబోయ్.. లబోదిబోమంటున్న రైతులు
ఈ డిజిటల్ తలనొప్పి చదువుకోని, స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియని వృద్ధులకు, పేద రైతులకు ఒక శాపంగా మారింది. అసలు ఫోన్ ఎలా వాడాలో తెలియని వారు యూరియాను ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గ్రామాల్లో ఇతరులను, యువకులను బతిమిలాడటం,వారి చుట్టూ పట్టా పాస్ బుక్ వెంట పెట్టుకుని తిరగడం వీరికి నిత్యకృత్యంగా మారింది. సాంకేతికత తెలియడమే తాము చేసిన పాపమా? మాకు ఎరువులు దక్కవా? అని వృద్ధ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
అధికారులారా.. క్షేత్రస్థాయికి రండి!
పారదర్శకత పేరుతో గదుల్లో కూర్చుని తయారు చేసే ఇటువంటి ఆన్‌లైన్ విధానాలు క్షేత్రస్థాయిలో రైతులను ఎలా వేధిస్తున్నాయో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న పరిస్థితులే నిదర్శనం.ఒకవైపు మార్కెట్‌లో నకిలీ విత్తనాల భయం,మరోవైపు ప్రాణాధారమైన యూరియా కోసం ఆన్‌లైన్ గండం.. వెరసి రైతన్న నలిగిపోతున్నాడు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్ కోటాను పెంచడమో,లేదా పాత పద్ధతిలోనే సొసైటీల ద్వారా నేరుగా ఎరువులు పంపిణీ చేయడమో చేయాలని జిల్లా రైతాంగం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.
ఆరు గంటలకే ఆన్‌లైన్ యుద్ధం: యువ రైతు కురుమ అనిల్, (తాడ్వాయి, కామారెడ్డి జిల్లా)
పొద్దున్నే ఆరు కాకముందే ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం లేటైనా సర్వర్ రాదు, యూరియా దొరకదు. మా లాంటి చిన్న రైతులకు ఈ ఫోన్ల బుకింగ్ ఏందో.. మా కష్టాలేందో అర్థం కావడం లేదు. అధికారులు పాత పద్ధతిలోనే సొసైటీల ద్వారా ఇస్తే బాగుంటుంది. జిల్లాలో ఎక్కడికి పోయినా రైతుల బాధ ఇదే.
ఆన్‌లైన్ ఇబ్బందులపై జిల్లా అధికారుల మీటింగ్‌లో చర్చిస్తాం: తాడ్వాయి వ్యవసాయ అధికారి నర్సింలు
సాంప్రదాయ యూరియా పంపిణీలో పారదర్శకత కోసమే ఆన్‌లైన్ విధానం తెచ్చినప్పటికీ, ఉదయం వేళల్లో సర్వర్ ఒత్తిడి, నెట్‌వర్క్ సమస్యల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. అయితే, రైతులు సాంప్రదాయ బస్తా యూరియా వాడకాన్ని తగ్గించి, అధునాతన నానో యూరియా వాడకం వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్ వల్ల చిన్న, వృద్ధ రైతులు పడుతున్న డిజిటల్ కష్టాలు, స్టాక్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. జిల్లా అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశం జరగనుంది.ఈ మీటింగ్‌లో క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆన్‌లైన్ కోటా పెంచేలా లేదా రైతులకు సులువైన పద్ధతిలో స్థానికంగానే ఎరువులు అందేలా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులతో చర్చిస్తాం. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.






