కాగజ్‌నగర్ ప్రగతి పథంలో పయనించాలి : ఎంపీ గోడం నాగేష్

by Batti.Sumithra |

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

కాగజ్‌నగర్ ప్రగతి పథంలో పయనించాలి : ఎంపీ గోడం నాగేష్
X

దిశ, కాగజ్‌నగర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నియోజకవర్గ పరిధిలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నాగేష్ సిర్పూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా తొలుత కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన శాఖా గ్రంథాలయ భవనానికి ఎంపీ గోడం నాగేష్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత సౌకర్యార్థం తన ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుంచి ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ గ్రంథాలయం ద్వారా పట్టణంలోని నిరుద్యోగ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం కాగజ్‌నగర్ మండలంలోని కొత్త సరసాల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎంపీ గోడం నాగేష్ ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు, స్థానిక పాలన మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంలో ఈ నూతన భవనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story