- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మునగనూరులో 200 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జాకు కుట్ర: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని మునుగనూరు గ్రామం సర్వే నంబర్–44లో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి, రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మునగనూరు లోని ప్రభుత్వ భూమి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని అధికార బలం, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఎమ్మెల్యే, ఎంపీలే రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ అధికారులను ఒత్తిడికి గురిచేసి రాత్రికి రాత్రే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు.
పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం...
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అండదండలతో గోపాల్ అనే వ్యక్తి మూడు సార్లు సర్వే నంబర్లు మార్చుతూ.. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఆస్తులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, సర్వే నంబర్–44లో బై-వన్ నంబర్లు సృష్టించి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం పార్కులు, ఓపెన్ జిమ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలనీ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు విఫలమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దండెం రామ్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, బొక్క గౌతం రెడ్డి, కాకుమాను చెన్నయ్య, బిందు రంగారెడ్డి, సంపతీశ్వర్ రెడ్డి, మోహన్ గుప్తా, ప్రభు వర్ధన్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, కొత్త కిషన్ గౌడ్, శశివర్ధన్ రెడ్డి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






