ఉద్యోగ క్రమశిక్షణే ముద్దు...జరిమానా వద్దు..!

by Muthe.Rajitha |

టీఎస్ సీసీఏ రూల్స్, 1991 అనేవి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ, తప్పులపై తీసుకునే చర్యలకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు.

ఉద్యోగ క్రమశిక్షణే ముద్దు...జరిమానా వద్దు..!
X

టీఎస్ సీసీఏ రూల్స్, 1991 (Telangana Civil Services – Classification, Control & Appeal Rules) అనేవి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ, తప్పులపై తీసుకునే చర్యలకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించే సమయంలో నిర్లక్ష్యం, అక్రమ ప్రవర్తన లేదా నియమాల ఉల్లంఘన చేస్తే, వాటికి తగిన శిక్షలను ఈ నిబంధనల ప్రకారం విధిస్తారు. ఈ రూల్స్ ద్వారా ఉద్యోగులపై క్రమశిక్షణను స్థాపించడం, పరిపాలనలో పారదర్శకతను కొనసాగించడం మరియు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉంటుంది.

-------------

టీఎస్ సీసీఏ రూల్స్, 1991 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తన ప్రదర్శించినప్పుడు వారికి వివిధ రకాల జరిమానాలు విధించబడతాయి. ఈ జరిమానాలు రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి, అవి మైనర్ పెనాల్టీలు మరియు మేజర్ పెనాల్టీలు..

రెండు రకాల పెనాల్టీలు..

మైనర్ పెనాల్టీలలో మందలింపు, పదోన్నతిని నిలిపివేయడం, ప్రభుత్వానికి కలిగిన ఆర్థిక నష్టాన్ని ఉద్యోగి జీతం నుండి పూర్తిగా లేదా పాక్షికంగా వసూలు చేయడం, సంచిత ప్రభావం లేకుండా వార్షిక వేతన పెంపును నిలిపివేయడం, అలాగే Rule 8 కింద ఇప్పటికే సస్పెండ్ అయిన సందర్భంలో ఆ సస్పెన్షన్‌ను నిర్దిష్ట జరిమానాగా పరిగణించడం ఉన్నాయి. మేజర్ పెనాల్టీలలో సంచిత ప్రభావంతో వార్షిక వేతన పెంపును నిలిపివేయడం, సీనియారిటీ జాబితాలో తక్కువ ర్యాంకుకు తగ్గించడం లేదా నేరుగా నియామకం పొందిన స్థాయి కంటే తక్కువ కాకుండా తక్కువ పోస్టుకు లేదా తక్కువ కాలపరిమితి స్కేల్‌కు తగ్గించడం, నిర్బంధ పదవీ విరమణ, తొలగింపు మరియు బర్తరఫ్ వంటి కఠినమైన చర్యలు ఉన్నాయి. ఉద్యోగి చేసిన తప్పిదం తీవ్రతను బట్టి ఈ జరిమానాలు విధించబడతాయి. ఈ మైనర్ పెనాల్టీని తక్కువ ప్రాముఖ్యత కలిగినదిగా భావించడం పొరపాటు.. GO-342 GAD(Ser) 1997 ప్రకారం మైనర్ పెనాల్టీ చిన్న విషయం కాదు.. అది విధిస్తే కనీసం సంవత్సరం ప్రమోషన్ ఆగుతుంది. ఇది Rule 10(i) జరిమానా లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు & అనుబంధం-Iలో పేర్కొన్న పోస్టులకు మాత్రమే.. ఇక Rule 10(ii) ప్రకారం ఫారెస్ట్ గార్డులు, పోలీస్ఫైర్ సబార్డినేట్ సర్వీసుల్లో కొన్ని వర్గాలకు గరిష్టం 15 రోజుల సస్పెన్షన్ పెనాల్టీ.

గెజిటెడ్ ఉద్యోగులపై శిక్ష విధింపు విధానాలు..

Censure అనేది అధికారిక శిక్ష, విధి నిర్లక్ష్యానికి ఇది విధించబడుతుంది. ఈ శిక్ష పొందిన ఉద్యోగి ఒక సంవత్సరం పాటు ప్రమోషన్‌కు అనర్హుడు. Warning అధికారిక శిక్ష కాదు, కానీ క్రమశిక్షణ చర్యల తర్వాత ఇస్తే ఉద్యోగి పూర్తిగా నిర్దోషి కాదని సూచించి భవిష్యత్ ఎంపికలపై ప్రభావం చూపవచ్చు. Removal అంటే సేవ నుండి తొలగింపు అయినా భవిష్యత్తు ఉద్యోగాలకు అడ్డంకి కాదు, కానీ Dismissal సాధారణంగా భవిష్యత్తు ఉద్యోగాలకు అనర్హత కలిగిస్తుంది. లంచం స్వీకరణ నిరూపితమైతే Removal లేదా Dismissal తప్పనిసరి. గెజిటెడ్ అధికారులపై పెనాల్టీలు విధించే అధికారం నియమాల ప్రకారం ఉంటుంది. శాఖాధిపతి ఇతర శిక్షలు విధించగలిగినా, Removal మరియు Dismissal అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉంటుంది. సబార్డినేట్ సర్వీస్ సభ్యులపై జరిమానాలను విధించే అధికారులను రూల్ 14లో పేర్కొనబడింది. ప్రత్యేక నిబంధన లేకపోతే, ఈ చర్యలు తక్షణ ఉన్నత గెజిటెడ్ అధికారి లేదా నియామక అధికారి చేయవచ్చు. అటువంటి అధికారి లేకపోతే, పై స్థాయి అధికారి ఆ అధికారాన్ని వహించవచ్చు. ఈ అధికారంలో పదోన్నతిని నిలిపివేయడం, సస్పెన్షన్, తక్కువ పదవికి తగ్గించడం, నిర్బంధ పదవీ విరమణ, తొలగింపు మరియు భర్తరఫ్ వంటి జరిమానాలు ఉన్నాయి. ఉన్నతాధికారి ఇచ్చే ఆదేశాలు ఎల్లప్పుడూ దిగువ స్థాయి అధికారుల నిర్ణయాలకు ప్రాధాన్యత కలిగినవి, అలాగే దిగువ స్థాయి అధికారి చేసిన చర్యలు ఉన్నతాధికారి అధికారాన్ని అడ్డుకోవు.

డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగుల శిక్ష విధింపు విధానాలు..

ఒక ఉద్యోగి తన సేవలను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి డిప్యూటేషన్‌పై వచ్చినప్పుడు, సదరు వ్యక్తికి తప్పనిసరి పదవి విరమణ తొలగింపు వంటి శిక్షణ విధించే అధికారము అప్పు (lending authority ) ఇచ్చిన సంస్థకు మాత్రమే ఉంటుంది. అప్పు తీసుకున్న సంస్థ ( borrowing authority ) అటువంటి శిక్షలు అవసరమని భావిస్తే విచారణ అధికారిని నియమించి లేదా స్వయంగా విచారణ జరిపి ఆ రికార్డులను అప్పు ఇచ్చిన సంస్థకు పంపాలి. అప్పు తీసుకున్న సంస్థ తక్కువ శిక్షలు అనుసరించాలనుకుంటే, అది అప్పు ఇచ్చిన సంస్థను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగిని సస్పెండ్ చేయడం, రూల్ 9 (i–iv) లోని లేదా రూల్ 10 (i) లోని శిక్షలు విధించడం అప్పు తీసుకున్న సంస్థకు సాధ్యం, కానీ ప్రభుత్వం సస్పెండ్ లేదా భారీ శిక్షలు విధించడానికి మాత్రమే అధికారం కలిగిన పోస్టులకు ఇది వర్తించదు. అప్పు తీసుకున్న సంస్థ సస్పెండ్ చేసినప్పుడు, ఆ వివరాలను వెంటనే అప్పు ఇచ్చిన సంస్థకు తెలియజేయాలి. అప్పు ఇచ్చిన సంస్థ సస్పెండ్‌కు ఏకీభవించకపోతే, ఉద్యోగిని తిరిగి అప్పు ఇచ్చిన సంస్థకు పంపాలి. ఈ విధానాలు తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల నుండి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయి.

-మనోహర్ రావు చిలప్పగారి,

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

96406 75288

Next Story