నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

by Muthe.Rajitha |   (  Updated:2026-06-01 02:36:28  IST  )

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి.

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ -2026 ఫలితాలను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీల్లో (IITs) బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced 2026) పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన అతను.. జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలో 300 మార్కులకు గాను.. 295 మార్కులతో ఆలిండియా 6వ ర్యాంక్ సాధించడం విశేషం. తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ లో టాప్ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. మొదటి నుంచి ఐఐటీలో చదవాలనే బలమైన కోరిక ఉన్న శుభమ్ కుమార్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే అమితమైన ఆసక్తి. ఐఐటీ బాంబేలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, ఆ రంగంలోనే స్థిరపడడమే తన జీవిత ఆశయమని తెలిపాడు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు (IIITs), ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో (GFTIs) ప్రవేశాల కోసం 'జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ' (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అభ్యర్థులు జూన్ 2, 2026 నుండి అధికారిక జోసా పోర్టల్‌లో తమ రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో (Preferred Choices) ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల మెరిట్ ర్యాంక్, కేటగిరీ, సీట్ల లభ్యత, వారు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా పలు విడతల్లో (Multiple Rounds) సీట్లను కేటాయించనున్నారు. సీట్ల ఎంపికలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు, ఆప్షన్లను సబ్మిట్ చేసే ముందు అందుబాటులో ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి అభ్యర్థులు తమ అకడమిక్ సర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

ఐఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 'ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్' (AAT) 2026 రాయాల్సి ఉంటుంది. ఏఏటీ రిజిస్ట్రేషన్ విండో జూన్ 1, 2026 ఉదయం 10:00 గంటల నుండి జూన్ 2, 2026 సాయంత్రం 5:00 గంటల (IST) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అధికారిక జెఈఈ అడ్వాన్స్‌డ్ క్యాండిడేట్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Next Story