మళ్ళీ ఉద్యోగ బాట పట్టిన జేడీ లక్ష్మీ నారాయణ... రాజకీయ సన్యాసమేనా?

by Muthe.Rajitha |   (  Updated:2026-02-16 13:45:57  IST  )

వ్యవస్థను మార్చాలనుకొని రాజకీయ వాస్తవాలకు తలవంచిన జేడీ లక్ష్మీనారాయణ

మళ్ళీ ఉద్యోగ బాట పట్టిన జేడీ లక్ష్మీ నారాయణ... రాజకీయ సన్యాసమేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతినిత్యం వ్యవస్థలోని లోపాలు, రాజకీయ ఒత్తిడి ఎదుర్కొనే ఉన్నతాధికారులు.. రాజకీయాలనే మారిస్తే వ్యవస్థ బాగుపడుతుందని.. ఉన్న ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి అడుగు పెడతారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి మాజీ అధికారి "ఈ భ్రష్టుపట్టిన వ్యవస్థను మార్చాలి", "ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలి", "అవినీతిని అంతం చేయాలి" అనుకుంటారు. దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా అదే నినాదంతో ప్రజల ముందుకు వచ్చారు. సీబీఐలో ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం, నిజాయితీ ఇమేజ్, కఠినమైన కేసులను ఎదుర్కొన్న ధైర్యం.. ఇవన్నీ కలిసి ఆయనను ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజలు చూడటం ప్రారంభించారు. కానీ రాజకీయాల్లోకి చేరి తిరిగి బయటకి వచ్చి కార్పొరేట్ రంగంలో ఉన్నత పదవిలో చేరడంపై తీవ్ర చర్చకు దారి తీసింది.

సిస్టమ్ నుంచి పాలిటిక్స్ లోకి ప్రయాణం..

సీబీఐలో ఉన్నత ఉద్యోగంలో పనిచేసిన జేడీ.. జగన్ అవినీతి, అక్రమ సంపాదన వంటి ప్రముఖ కేసులను దర్యాప్తు చేయడంతో... ఆయన పేరు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అనంతరం వ్యవస్థలో మార్పుల కోసం, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరినప్పుడు కూడా జేడీ చాలా క్లారిటీతోనే ఉన్నారు. సంప్రదాయ రాజకీయాలు సేవతో నడవవు. సంఖ్యాబలం, ఆర్థిక వనరులు, సామజిక సమీకరణలు వంటి అంశాలతో నడిచే భిన్నమైన మార్గం రాజకీయ పథం. తను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న జనసేన పార్టీ అంతర్గత వ్యూహాలపై, పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఒక కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించాలంటే సహనం, నిర్మాణం, గడ్డిపరక స్థాయి నుంచి మహావృక్షం అయ్యేవరకు ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అవసరం. అది జేడీలో లోపించింది.

కొత్త పార్టీ.. ప్రజల మద్దతు కరువు

జనసేన నుంచి బయటకు వచ్చి జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. అయితే స్వంత పార్టీ ప్రారంభించడం కూడా ఒక ధైర్య నిర్ణయమే. కానీ అది సిద్ధాంతబద్ధమైన ఉద్యమంగా ఎదగకముందే రాజకీయ ప్రభావం కోల్పోయింది. ఎన్నికల ఫలితాలు జేడీకి స్పష్టమైన క్లారిటీ ఇచ్చాయి. ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించినా, రాజకీయ ప్రత్యామ్నాయం అని భావించలేదు. 2024 లో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.

కార్పొరేట్ ఉద్యోగం.. వ్యూహాత్మకమా.. అవసరమా?

కొంతకాలం మౌనంగా ఉన్న జేడీ తాజాగా.. మేఘా గ్రూప్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా చేరడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, "ప్రజాసేవ" అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి, కొద్ది కాలంలోనే మళ్లీ కార్పొరేట్ రంగంలో ఉన్నత పదవిని చేపట్టడం పట్ల ప్రజలు జేడీ నిబద్ధతను శంకిస్తున్నారు. రాజకీయాలు ఒక దీర్ఘకాల యుద్ధం. ఓటములు సహజం. కానీ మొదటి లేదా రెండవ ఓటమికే రాజకీయాలకు స్వస్తి పలకడం ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. "వ్యవస్థను మార్చాలి" అన్న సంకల్పం అంత బలంగా లేకపోయిందా? లేదా రాజకీయాల్లో ఎదురయ్యే కఠిన వాస్తవాలను అంచనా వేయలేకపోయారా? అని చర్చించుకుంటున్నారు.

పరాజయమా.. పరిణామమా?

తన పార్టీ ఘోర ఓటమి తర్వాత జేడీ మేఘా గ్రూప్ వంటి పెద్ద సంస్థలో ఉన్నత పదవిలో చేరడం కేవలం కెరీర్ మార్పా? లేక రాజకీయాల్లోని అస్థిరత నుంచి బయటపడే వ్యూహమా? అనే ప్రశ్నలకు విమర్శకులు చెబుతున్నదేమిటంటే.. ఒకప్పుడు వ్యవస్థలో అవినీతి, రాజకీయ–కార్పొరేట్ సంబంధాలపై విమర్శలు చేసిన వ్యక్తి, ఇప్పుడు అదే కార్పొరేట్ వ్యవస్థలో కీలక స్థానం స్వీకరించడం తన ఆత్మభిమానాన్ని చంపుకోవడం లాంటిదే అంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో అవకాశాలు పరిమితమైనప్పుడు, ఒక వ్యక్తి తన నైపుణ్యాన్ని మరొక రంగంలో వినియోగించుకోవడం సహజమేనని ఆయన అనుకూల వర్గం చెబుతోంది. అంతేకాదు ఇటీవల ఆయన కుటుంబం ఆ పెద్ద సైబర్ మోసంలో ఇరుక్కొని భారీగా డబ్బులు పోగొట్టుకోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. కానీ ప్రజా జీవితం నుంచి వచ్చిన నాయకుడికి ఈ మార్పు ప్రజల్లో నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ కలగజేస్తుంది అనేది కూడా వాస్తవం.

ఇమేజ్ రాజకీయాలు vs వాస్తవ రాజకీయాలు

జేడీ లక్ష్మీనారాయణ ప్రయాణం ఒక పెద్ద గుణపాఠం లాంటిది. నిజాయితీ ఇమేజ్ రాజకీయాల్లో విజయానికి సరిపోదు. సంస్థాగత బలం, కూటములు, వనరులు, మరియు దీర్ఘకాల వ్యూహం అవసరం. అయితే ప్రస్తుత వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తి ఎందుకు దీర్ఘకాల పోరాటానికి సిద్ధంగా నిలబడలేదు? అనే ప్రశ్నకి ఆయనే సమాధానం చెప్పాలి. విలువలతో కూడిన నాయకత్వం ఆశించిన వారికి జేడీ ప్రయాణం ఒక అసంపూర్ణ పోరాటంలా కనిపిస్తుంది.

Next Story