విపక్షాలది ‘సెల్ఫ్ గోల్’.. నియోజకవర్గాల పునర్విభజన పై జయప్రకాశ్ నారాయణ సంచలన విశ్లేషణ

by Malleboina Mahesh |   (  Updated:2026-04-18 06:37:28  IST  )

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై జయప్రకాశ్ నారాయణ ఆగ్రహం! దక్షిణాది రాష్ట్రాలు 35 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, విపక్షాల తీరు తమ సొంత కళ్ళను తామే పొడుచుకున్నట్లు ఉందని విమర్శ.

విపక్షాలది ‘సెల్ఫ్ గోల్’.. నియోజకవర్గాల పునర్విభజన పై జయప్రకాశ్ నారాయణ సంచలన విశ్లేషణ
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో విఫలం కావడంపై లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ శత్రుత్వం తో విపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాబల్యాన్ని భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లు ఆగిపోవడంతో ఇకపై లోక్‌సభ సీట్ల కేటాయింపు 2026 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇది జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శాపంగా మారబోతుందని ఆయన విశ్లేషించారు.

రాష్ట్రాల వారీగా సీట్ల కోత అంచనా..

జేపీ విశ్లేషణ ప్రకారం, కొత్త నియోజకవర్గాల విభజన వల్ల ఏడు రాష్ట్రాలు ఏకంగా 35 లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. ఇందులో తమిళనాడు 10 సీట్లు, కేరళ 7 సీట్లు, ఆంధ్రప్రదేశ్ 5 సీట్లు, తెలంగాణ-3 సీట్లు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు, కర్ణాటక 2 సీట్లు కోల్పోయే అకవాశం ఉంది. అలాగే ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాలు (యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్) కలిపి సుమారు 34 కొత్త సీట్లను పొందే అవకాశం ఉంది. ఇది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విపక్షాల ‘అనాలోచితం’

ప్రస్తుతమున్న సీట్ల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారమే ‘ఫ్రీజ్’ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ముందుకు రావడం దక్షిణాది రాష్ట్రాలకు ఒక అయాచిత వరమని, కానీ విపక్షాలు దీనిని గుర్తించడంలో విఫలమయ్యాయని జేపీ విమర్శించారు. రాజకీయంగా బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నా, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని.. అయితే విపక్షాలు దీనిని అడ్డుకోవడం "ముక్కు కోసుకుని శకునం మార్చుకున్నట్లు" (Cutting the nose to spite the face) ఉందని ఆయన అభివర్ణించారు. 2001లో వాజ్‌పేయి హయాంలో కూడా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే 84వ సవరణ ద్వారా సీట్ల ఫ్రీజ్‌ను మరో 25 ఏళ్లు పొడిగించడంలో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు.

వలసలే పరిష్కారం - సమగ్ర దృక్పథం అవసరం..

జనాభా అసమానతలకు 'అంతర్గత వలసలు' ఒక పరిష్కారమని, అమెరికా వంటి దేశాల్లో ఇది విజయవంతమైందని జేపీ సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలు విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకుని, జాతీయ సమగ్రత, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జయప్రకాశ్ నారాయణ కోరారు. సీట్ల కేటాయింపు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని, అన్ని పార్టీలు కలిసి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story