- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో జనసేన ప్రభంజనం.. పార్టీలో చేరిన పలు పార్టీల ముఖ్య నేతలు
జనసేన పార్టీ కేరళలో తన విస్తరణను ప్రారంభించింది. తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో 200 మందికి పైగా వివిధ పార్టీల నేతలు జనసేనలో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (Janasena party) తన ఉనికిని పొరుగు రాష్ట్రమైన కేరళకు సైతం విస్తరిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన కేరళ (Kerala)లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి సుమారు 200 మందికి పైగా ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆదివారం (ఏప్రిల్ 19, 2026) జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తిరువనంతపురంలో జరిగిన ఈ విస్తరణ స్థాయి సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పాల్గొని నూతన సభ్యులను సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని, పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతమని నాగబాబు పేర్కొన్నారు. స్థానిక నేతల అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేరళలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ వంటి పలు పార్టీల నుండి నాయకులు జనసేనలో చేరారు. వీరిలో అట్టింగల్, త్రివేండ్రం, కాలికట్, కొచ్చి, వైయనాడ్ వంటి కీలక నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు ఉండటం విశేషం.
కేరళ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తామని తాళ్లూరి రామ్ తెలిపారు. స్థానిక సమస్యలకు అనుగుణంగా కేరళలో పార్టీ విధివిధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళ రాజధానిలో జరిగిన ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






