- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరగనున్న జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరగనున్న జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాష్ట్ర పండగగా జరపనుంది. జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు జరిగే ఈ ప్రభల తీర్థం 476 ఏళ్ల ప్రాచీన సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలకు కోనసీమ జిల్లా నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.
కోనసీమలోని 11 గ్రామాల నుంచి బయలుదేరే ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో ఒకచోట చేరి ప్రజల క్షేమం గురించి చర్చిస్తారన్నది స్థానికుల విశ్వాసం. ముసలపల్లి భోగేశ్వర స్వామి ప్రభ ముందుగా జగ్గన్నతోటకు చేరగా, చివరగా గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశకినది దాటుకుంటూ తోటలోకి చేరుకుంటుంది. కోనసీమ వ్యాప్తంగా 160 ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు వైభవంగా జరుగుతుండగా.. ప్రభల ఊరేగింపులు చూడడానికి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో ప్రభల తీర్థానికి 300 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.






