నకిరేకల్ మేయిన్ సెంటర్‌లో నిత్యం నరకమే!

by Malleboina Mahesh |

నకిరేకల్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ గందరగోళం! సిగ్నల్స్ లేక నిత్యం ప్రమాదాలు. నిలువ నీడ లేక ప్రయాణికుల అవస్థలు. అధికారుల స్పందన కోసం నిరీక్షణ.

నకిరేకల్ మేయిన్ సెంటర్‌లో నిత్యం నరకమే!
X

నకిరేకల్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేక ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో ఇక్కడి నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. బస్సుల కోసం వచ్చే వేలాది మంది ప్రయాణికులకు కూడలి వద్ద కనీస వసతులు, నిలువ నీడ లేవు. పట్టణానికి దూరంగా ఉన్న బస్టాండ్‌ను జంక్షన్ సమీపంలోకి మారిస్తే సమస్య తీరుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లే బస్సు ఎక్కడ నిలుస్తుందో తెలియక మహిళలు, వృద్ధులు తికమక పడుతున్నారు. జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ఆక్రమణలు, అస్తవ్యస్త పార్కింగ్‌పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ పోస్టును ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు.

దిశ, నకిరేకల్: నకిరేకల్ పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రయాణికులకు శాపంగా మారింది. ఈ జంక్షన్ గుండా ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, వాహనదారులు జంకుతున్నారు. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున ప్రతిరోజూ అధికారులు, పాలకులు తిరిగే చోటే ఈ దుస్థితి నెలకొనడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

రద్దీకి తోడు.. అస్తవ్యస్త ప్రయాణం..

ఈ కూడలి ద్వారా నిత్యం హైదరాబాద్, సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి ప్రాంతాలకు సుమారు 500 ఆర్టీసీ బస్సులో పాటు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రతిరోజూ పదివేల మందికి పైగా ప్రయాణికులు ఇక్కడ బస్సుల కోసం వేచి ఉంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే సమీపంలోని చేపల మార్కెట్, మాంసం దుకాణాలకు వచ్చేవారితో రద్దీ మరింత పెరుగుతోంది. పాఠశాల వాహనాలు, ఉద్యోగుల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు.

నిలువ నీడ లేక ఎండలో అవస్థలు

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఈ కూడలి వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కనీసం నిలుచునేందుకు నీడ లేక ఎండకు, వానకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ పట్టణానికి దూరంగా ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. కూడలి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్‌ను పట్టణ శివార్లకు మారిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతోపాటు కూడలి వద్ద రద్దీ తగ్గుతుందని చెబుతున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాల్సిందే!

నకిరేకల్ జంక్షన్ వద్ద తక్షణమే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం తో పాటు పాదచారులకు రక్షణ కల్పించేందుకు సిగ్నల్ వ్యవస్థ ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. వీటికి తోడు నిత్యం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఇక్కడ నియమించాలని కోరుతున్నారు. రోడ్డుపై దుకాణదారులు జరిపిన ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నకిరేకల్ కూడలిని ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి విముక్తి చేయాలని కోరుతున్నారు.

Next Story