- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబాసుపాలవుతున్న రెవెన్యూ పోస్టింగుల వ్యవహారం
జోగులాంబ గద్వాల జిల్లాలో రెవెన్యూ శాఖలోని పదోన్నతులు, పోస్టింగుల వ్యవహారం అభాసుపాలవుతోంది.

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి: రెవెన్యూ శాఖలోని నిబంధనలను గాలికి వదిలేస్తూ అర్హత, సీనియార్టీ ప్రతిపాదికన జరగాల్సిన పదోన్నతులు పోస్టింగుల వ్యవహారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పుడు అభాసుపాలవుతోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో తహసీల్దార్లు, ఏళ్ల తరబడి విధుల్లో ఉండి తహసీల్దార్ హోదా కోసం ఎదురుచూస్తున్న సీనియర్ డిప్యూటీ తహసీల్దార్లను కాదని రాజకీయ చదరంగంలో తమకు కావలసిన జూనియర్లకు తహసీల్దార్ బాధ్యతలు కట్టబెట్టడంపై వింత పోకడలు చోటుచేసుకుంటూ జిల్లా రెవెన్యూ శాఖలో తీవ్ర దుమారం రేగుతుంది. చట్టం, నిబంధనలు, సర్వీస్ రూల్స్ అన్నీ పక్కనపెట్టి రాజకీయ పైరవీల ప్రాతిపదికన పోస్టింగులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పని అనుభవం ఉన్న సీనియర్ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికే పరిమితం చేస్తూ అనుభవం లేని జూనియర్లను మండలాలకు తహసీల్దార్లుగా పంపిస్తూ జిల్లా యంత్రాంగం 'పబ్బం' గడుపుకుంటోంది.
కలెక్టరేట్‌కు సీనియర్లు పరిమితం..
దశాబ్దాల సర్వీసు ఉండి క్లిష్టమైన భూ సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్న సీనియర్ అధికారులను కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లలో నామమాత్రపు పోస్టులకు పరిమితం చేశారు. రాజకీయ నేతలకు లొంగని వారు, నిబంధనల ప్రకారం పనిచేసే వారిని మండలాల్లో ఉండనివ్వకుండా కలెక్టరేట్‌కు అటాచ్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. తద్వారా మండలాల్లో తమకు కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడానికి రాజకీయ ఒత్తిడి వల్ల 'తమకు అనుకూలమైన' వారిని అధికార పార్టీ నాయకులు నియమించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జూనియర్లకు పట్టాభిషేకం..
ఇంకా ప్రొబేషన్ పిరియడ్ కూడా సరిగ్గా పూర్తికాని జూనియర్ డిప్యూటీ తహశీల్దార్లను ఏకంగా తహశీల్దార్ హోదాలో మల్దకల్, ఉండవెల్లి ధరూరు,కేటీ దొడ్డి, ఇటిక్యాల, గట్టు మండలాలకు పంపించడం చర్చనీయాంశంగా మారింది. వీరికి రాజకీయ నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటమే కారణమని రెవెన్యూ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. అనుభవం లేని వారు కుర్చీలో కూర్చోవడం వల్ల సామాన్య ప్రజలు, రైతులు, భూ భారతి సమస్యలు, పట్టా మార్పిడి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం...
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి గతంలో ఉన్నత అధికారులు స్థానిక రాజకీయ నేతలు ఇచ్చే లిస్టుల ప్రకారం పోస్టింగులు ఇచ్చారనే విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాను తుంగలో తొక్కి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ బదిలీలు జరిగాయని స్పష్టమవుతోంది. ఇది రెవెన్యూ శాఖలోని నిబద్ధత గల అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని జిల్లాలో పనిచేస్తున్న కొందరు తహసీల్దార్లు, సీనియర్ డిప్యూటీ తహసీల్దార్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోస్టింగుల వెనక పైరవీలు...
ఈ పోస్టింగుల వెనుక భారీ స్థాయిలో పైరవీలు నడిచాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అర్హత ఉన్నవారిని ఆఫీసులకే పరిమితం చేసి కేవలం వారి అనుకూలతను చూసుకొని అనర్హులకు బాధ్యతలు అప్పగించడం వల్ల జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ట మసకబారుతుంది.
సీసీఎల్ఏ జోక్యం చేసుకోవాలి...
జిల్లాలో సాగుతున్న ఈ అక్రమ పోస్టింగుల పర్వంపై రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు (సీసీఎల్‌ఏ) తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. సీనియారిటీ జాబితాను సమీక్షించి, అర్హత గల వారికి మండలాల్లో బాధ్యతలు అప్పగించాలని జిల్లా ప్రజలు, బాధిత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రతిష్ట మసకబారక ముందే ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






