- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానేరు వాగులో ఇసుక దందా.. అక్రమమా? సక్రమమా?
మానేరు వాగులో సాగుతున్న ఇసుక తవ్వకాలు అక్రమమా? లేక సక్రమమా? అనే సందేహాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి.

దిశ, కరీంనగర్ బ్యూరో: మానేరు వాగులో సాగుతున్న ఇసుక తవ్వకాలు అక్రమమా? లేక సక్రమమా? అనే సందేహాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇసుక తవ్వకాలపై పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అధికార బలంతో జులూం ప్రదర్శిస్తున్న ఇసుక మాఫియా ఖాకీల కనుసన్నల్లో యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇసుక రీచ్ ల పేరిట అనుమతులు ఇచ్చిన టీఎస్ ఎండీసీ అధికారులు అక్రమ దందాలో నీకెంత? నాకెంత? అన్నట్టుగా వ్యవహరిస్తూ అటు వైపు కన్నెత్తి చూడకపోగా అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు మా పరిధి కాదంటూనే అక్రమ ఇసుక రవాణా పై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులకు అండగా నిలవాల్సింది పోయి అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో మానేరులో ఇసుక తవ్వకాలు యథేశ్చగా సాగిస్తున్నారు
కోర్టు ఆర్డర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్..
మానేరులో ప్రకృతి సహజసిద్ధంగా నిక్షిప్తమైన ఇసుక నిలువలతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లు అధికారుల తీరుతో అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారాయి. గతంలో ప్రభుత్వం ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసేందుకు మానేరులో ఇసుకను తవ్వేందుకు కాంట్రాక్టులు పిలవగా అప్పుడు ఇసుక రీచ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మానేరు నుంచి తీసిన ఇసుకను తోడి రీచ్ లో కుప్పలు పోసి నిలువ ఉంచారు. దీంతో మానేరులో ఇసుక తవ్వకాలపై మానేరు పరిరక్షణ సమితి పేరిట పరిసర గ్రామాలు ఆందోళన బాట పట్టాయి. అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకునేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.
దీంతో స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మానేరులో ఇసుక తవ్వకాలను తక్షణమే ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో రీచ్ లను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రీచ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. ఇసుక తవ్వకాల కోసం పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దివాలతీస్తున్నాం.. తవ్విన ఇసుకను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ప్రాధేయపడటం తో తవ్విన ఇసుకను తరలించేందుకు అనుమతి ఇవ్వగా నిర్వాహకులు ఇప్పుడు కోర్టు ఆర్డర్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మానేరులో ఇసుకను తవ్వుతూ అక్రమంగా తరలించడం వివాదస్పదంగా మారుతుంది.
అక్రమ ఇసుక తవ్వకాల్లో నీకింత! నాకెంత ?
ఇసుక రీచ్ నిర్వాహకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కి కోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ ఇసుక తవ్వకాలు చేయడం వివాదాస్పదంగా మారుతుంది. అయితే అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు, రీచ్ నిర్వాహకులు చేసే అక్రమ రవాణాలో నీకింత ! నాకెంత ?అంటూ అక్రమ దందాలో శాఖల వారీగా సమపాళ్లలో పంచుకోవడంతో రీచ్ నిర్వహకులు మానేరు నే అడ్డగా మార్చుకుని అక్రమ దందా సాగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా మానేరులో తవ్వకాలు చేస్తూ లారీలు, టిప్పర్ల ద్వార ఇసుకను తరలిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రీచ్ నిర్వాహకులు ప్రజాధనంతో నిర్మించిన రోడ్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. మానేరునే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న పల్లెలను ప్రశాంతతకు దూరం చేస్తూ వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు
ఇసుక ఆపాలంటూ స్థానికుల ఆగ్రహం
మానేరులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేయడాన్ని పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రీచ్ నిర్వాహకులు చేస్తున్న తవ్వకాలను అడ్డుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మానేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. స్థానికుల ఆందోళనతో అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడం పై అధికారుల తీరును తప్పు పడుతున్న స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అక్రమార్కులకు అండగా నిలవడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు స్పందించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమ దందా సాగిస్తున్న ఇసుక రీచ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని లేదంటే భవిష్యత్ లో ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.






