- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ అంత్యక్రియలపై ఇరాన్ ప్రకటన
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నిర్వహణపై ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నిర్వహణపై ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయం నుండి ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భద్రతా కారణాలు, అంత్యక్రియలకు ఊహించని స్థాయిలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో మార్చి నెల నుండి ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇరాన్ అధికారిక స్టేట్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, ఖమేనీ "గ్రాండ్ ఫ్యూనరల్" నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇరాన్ క్యాలెండర్ ప్రకారం ఖొర్దాద్ నెల ముగిసే సమయమైన జూన్ చివరి వారంలో (జూన్ 21 తర్వాత) ఈ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని టెహ్రాన్ మున్సిపాలిటీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ప్రభుత్వం సిద్ధం చేసిన సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం, మొదట మూడు రోజుల పాటు దేశ రాజధాని టెహ్రాన్‌లో అధికారిక వీడ్కోలు వేడుకలను నిర్వహిస్తారు. అనంతరం ఖమేనీ భౌతిక కాయాన్ని టెహ్రాన్ నుండి ఖోమ్ నగరానికి, అక్కడి నుండి ఆయన పుట్టిన స్థలమైన మషాద్ నగరానికి తరలిస్తారు. చివరగా మషాద్‌లోని పవిత్రమైన 'ఇమామ్ రెజా ష్రైన్' (Imam Reza Shrine) ప్రాంగణంలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. కేవలం టెహ్రాన్ నగరంలోనే జరిగే వీడ్కోలు సభలకే దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది జనం హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంతటి భారీ జనాన్ని నియంత్రించడం, భద్రతను పర్యవేక్షించడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. కాగా, ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇప్పటికే బాధ్యతలు చేపట్టి, ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.






