- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ టైం కనిష్టానికి ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 15 లక్షల రియాల్స్
ఇరాన్ కరెన్సీ అయిన ఇరానియన్ రియాల్ మళ్లీ భారీగా పడిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ కరెన్సీ అయిన ఇరానియన్ రియాల్ మళ్లీ భారీగా పడిపోయింది. ఓపెన్ మార్కెట్‌లో ఒక అమెరికన్ డాలర్‌కు ఆల్ టైమ్ కనిష్టంగా సుమారు 14.7 లక్షల నుంచి 15 లక్షల రియాల్స్ వరకు డౌన్ అయింది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. 2025 చివరితో పోలిస్తే రియాల్ విలువ దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. అయితే ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించే అధికారిక రేటు సుమారు 42 వేల రియాల్స్‌గా ఉన్నప్పటికీ, ఆ రేటును సాధారణంగా ఎవరూ ఉపయోగించరు. దేశంలో వాస్తవంగా జరిగే లావాదేవీలు అన్నీ ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారమే జరుగుతున్నాయి.
ఇరాన్ కరెన్సీ పతనానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా సహా పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్‌కు చమురు ఎగుమతులు తగ్గాయి. విదేశీ కరెన్సీ దేశంలోకి రావడం బాగా తగ్గిపోయింది. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. 2025 డిసెంబర్ నాటికి ఇన్‌ఫ్లేషన్ 40 శాతానికి పైగా ఉండగా, ఆహార పదార్థాల ధరలు 70 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ధరల పెరుగుదలతో ప్రజలు ఆందోళనకు గురై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేశారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు, సబ్సిడీల తగ్గింపు, ఫారెక్స్ నియమాల్లో మార్పులు కూడా పరిస్థితిని మరింత దిగజారేలా మార్చాయి.
ఇది సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్ అంటే దిగుమతి చేసుకునే ఆహారం, మందులు, టెక్నాలజీ వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్, మాంసం, ఔషధాలు వంటి అవసరమైన వస్తువులు కూడా సామాన్యులకు అందని స్థితికి చేరుతున్నాయి. ఇరాన్ ఇప్పుడు హైపర్ ఇన్‌ఫ్లేషన్ దశకు చేరిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రజలు తమ డబ్బు విలువ కాపాడుకోవడానికి డాలర్లు, బంగారం, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెడుతున్నారు.
ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ మాత్రం దీనిని సహజ ప్రక్రియగా చెబుతున్నా, ఆర్థిక నిపుణులు ఇది తీవ్రమైన ఆర్థిక సంక్షోభమని, రాబోయే రోజుల్లో మరిన్ని నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ రియాల్ ప్రపంచంలోనే అతి తక్కువ విలువ గల కరెన్సీల జాబితాలో ఒకటిగా చేరింది.






