- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'హర్మూజ్' లోకి నౌకలు వస్తె పేల్చేస్తాం : ఇరాన్ వార్నింగ్
హర్మూజ్ జలసంధి మార్గం గుండా ఏ దేశానికి చెందిన నౌకలు గాని, ఆయిల్ ట్యాంకర్లు గాని వస్తే, వాటిపై క్షిపణులతో దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలోకి ఏవైనా నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధం భయంకరమైన మలుపు తిరిగినట్టైంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేస్తున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది. కేవలం మూసివేయడమే కాకుండా, ఈ మార్గం గుండా ఏ దేశానికి చెందిన నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణించడానికి ప్రయత్నించినా, వాటిపై క్షిపణులతో దాడులు చేస్తామని ఇరాన్ కమాండర్ ఇబ్రహీం జబారి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
"ఆ ప్రాంతం నుండి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లనివ్వం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నాయి. ఈ హెచ్చరిక వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ దిగ్బంధం వల్ల ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. హర్మూజ్ మార్గం గుండానే సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ మరియు ఇరాక్ నుండి భారత్‌కు చమురు సరఫరా జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధ నౌకలు, ఆత్మాహుతి డ్రోన్లు ఈ సన్నని సముద్ర మార్గంలో పహారా కాస్తుండటంతో, వందలాది ఆయిల్ ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.
షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా రక్షణ విభాగం (CENTCOM) స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ మార్గమని, దానిని మూసివేసే హక్కు ఇరాన్‌కు లేదని స్పష్టం చేసింది. కాగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను తీరప్రాంతం వెంబడి మోహరించడంతో, ఏ క్షణంలోనైనా సముద్రంలో నౌకలపై దాడులు జరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం చమురు సంక్షోభమే కాకుండా, ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి (Global Recession) దారితీసే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






