రెండో దశ చర్చలకు ఇరాన్ నో

by Muthe.Rajitha |

ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో జరగాల్సిన రెండో రౌండ్ చర్చలకు ఇరాన్ నిరాకరించింది.

రెండో దశ చర్చలకు ఇరాన్ నో
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో రౌండ్ చర్చలకు ఇరాన్ నిరాకరించింది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగినప్పటికీ, ఎలాంటి స్పష్టమైన ఫలితం రాకపోవడంతో ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా విధిస్తున్న షరతులు, క్షేత్రస్థాయిలో దాడులు.. ఈ అనిశ్చితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ అధికారిక మీడియా 'తస్నిమ్', విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్చల ప్రక్రియలో అమెరికా "మితిమీరిన డిమాండ్లు" (Excessive Demands) చేస్తోందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళం విధిస్తున్న దిగ్బంధనాన్ని (Naval Blockade) ఎత్తివేయకపోవడం ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. దీనితో పాటు, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలపై అమెరికా పెడుతున్న షరతులు తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బగాయి స్పష్టం చేశారు. అమెరికా నిజాయితీతో కూడిన చర్చలకు ముందుకు రావాలని, అప్పుడే రెండో రౌండ్ సాధ్యమవుతుందని ఇరాన్ తెగేసి చెప్పింది.

మరోవైపు, ఈ పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందిస్తూ.. తమ షరతులను అంగీకరించడంలో ఇరాన్ మొండివైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రాంతీయ భద్రత దృష్ట్యా హార్మూజ్ జలసంధిపై నిఘా, నియంత్రణలు అవసరమని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రెండో రౌండ్ చర్చల తేదీలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు విఫలమవుతుండటం, మరోవైపు సముద్ర మార్గాల్లో దిగ్బంధనాలు కొనసాగుతుండటంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయనే ఆందోళన అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతోంది.

Next Story