జెరూసలెంపై ఇరాన్ క్షిపణి దాడి.. పవిత్ర ఆల్ అక్సా మసీదు సమీపంలో భారీ పేలుడు

by Muthe.Rajitha |

ఇరాన్ ప్రయోగించిన క్షిపణి జెరూసలెంలోని ముస్లింలకు అత్యంత పవిత్రమైన అల్ అక్సా మసీదుకు అత్యంత సమీపంలో పడింది.

జెరూసలెంపై ఇరాన్ క్షిపణి దాడి.. పవిత్ర ఆల్ అక్సా మసీదు సమీపంలో భారీ పేలుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ముస్లింలు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే జెరూసలెంలోని అల్ అక్సా మసీదుకు అత్యంత సమీపంలో ఇరాన్ క్షిపణి పడటం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో.. రంజాన్ పర్వదినం సమయంలో కూడా భద్రతా కారణాల దృష్ట్యా మసీదులోకి ఎవరినీ అనుమతించకపోవడం గమనార్హం. గత ఆరు దశాబ్దాల కాలంలో రంజాన్ ప్రార్థనల సమయంలో ఇలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి. లోపలికి అనుమతి లభించకపోవడంతో వందలాది మంది ముస్లిం సోదరులు మసీదు గేట్ల బయటే వీధుల్లో ప్రార్థనలు చేసుకోవడం అక్కడి ఉద్రిక్తతకు అద్దం పడుతోంది.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఇరాన్ తీరును ఎండగట్టింది. ముస్లింలు, క్రైస్తవులు, యూదులకు అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశాలకు కొద్ది దూరంలోనే క్షిపణి పడటం ఇరాన్ పాలకుల బాధ్యతారాహిత్యాన్ని, వారి అసలు స్వభావాన్ని తెలియజేస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, పవిత్ర స్థలాల రక్షణపై ఇరాన్‌కు కనీస గౌరవం లేదని ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. ఈ దాడి వల్ల ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, అది పడిన ప్రదేశం యొక్క సున్నితత్వం దృష్ట్యా ఇది అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై, మతపరమైన సెంటిమెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జెరూసలెంలో హై-అలెర్ట్ ప్రకటించారు.

Next Story