- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూక్లియర్ డీల్ కు ఓకే.. కానీ.. : ఇరాన్
న్యూక్లియర్ ఒప్పందానికి కొన్ని షరతుల మీద ఇరాన్ అంగీకరించింది.

దిశ,వెబ్ డెస్క్ : అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు కొనసాగుతున్న వేళ, అణు ఒప్పందం విషయంలో రాజీకి సిద్ధమని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్ డెప్యూటీ విదేశాంగ మంత్రి మజీద్ తక్త్ రవంచి (Majid Takht-Ravanchi) బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అమెరికా తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి సిద్ధమైతే, ఇరాన్ తన అణు కార్యక్రమంలోని కొన్ని అంశాలపై ముఖ్యంగా హై ఎన్రిచ్డ్ యురేనియం నిల్వల విషయంలో రాజీకి సిద్ధమని స్పష్టం చేశారు. "బాల్ ఇప్పుడు అమెరికా కోర్టులో ఉంది. అమెరికా నిజాయితీగా ముందుకు వస్తే, చర్చలు సాధ్యమే" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇరాన్ అణుశక్తి సంస్థ అధిపతి మహమ్మద్ ఇస్లామీ (Mohammad Eslamiప్) కూడా సమర్థించారు. "మా వద్ద నిల్వ ఉన్న హై ఎన్రిచ్డ్ యురేనియాన్ని డైల్యూట్ చేయడానికి సిద్ధమే, కానీ ముందు అమెరికా పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేయాలి" అని పేర్కొన్నారు.
అయితే ఇరాన్ కండిషన్స్ ఇప్పటివి కాదు. గతంలో ఇరు దేశాల మధ్య కొనసాగిన ఒప్పందమే ఇది. 2015లో కుదిరిన జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాలు, నిల్వలు పూర్తిగా తగ్గించాలి. బదులుగా అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చి మళ్లీ కఠిన ఆంక్షలు విధించడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఇరాన్ మళ్ళీ యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ను 60 శాతం వరకు పెంచింది. ఇది అణ్వాయుధ స్థాయి (90%)కు దగ్గరగా ఉందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2021లో జో బైడెన్ (Joe Biden) పరిపాలన చర్చలు పునఃప్రారంభించినా, 2022లో అవి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో జెనీవాలో మరోసారి చర్చలు జరుగుతున్నాయి.
కాగా ఇరాన్ ప్రకటనపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా, చర్చలు కొనసాగుతున్నాయని మాత్రం తెలిపింది. ఇదిలా ఉండగా, ఇస్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి. అందువల్ల ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ రాజకీయ సమీకరణాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచశాంతి దిశగా ఒక సానుకూల సంకేతంగా కనిపించినప్పటికీ.. ఆంక్షల ఎత్తివేత అంశం అమెరికాకు రాజకీయంగాను, వ్యూహాత్మకంగానూ క్లిష్టమైన నిర్ణయంగా మారే అవకాశం ఉంది.






