అమెరికాతో మళ్ళీ యుద్ధం! : ఇరాన్

by Muthe.Rajitha |

ఇరాన్ - అమెరికా మధ్య ఏ క్షణమైనా మరో యుద్ధం జరగవచ్చని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి చేసిన హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాతో మళ్ళీ యుద్ధం! : ఇరాన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ - అమెరికా మధ్య కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. ఏ క్షణమైనా మరో యుద్ధం జరగవచ్చని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి చేసిన హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా గనుక మళ్ళీ తమపై దాడులకు పాల్పడితే, ఆ పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని, తాము ఇచ్చే ప్రతీకార దెబ్బలు అత్యంత "దీర్ఘకాలికంగా మరియు బాధాకరంగా" ఉంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలకు, గతంలో చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలను తగ్గించడానికి, తమ చుట్టూ సృష్టించబడ్డ గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే అమెరికా అధికారులు ప్రకటనలు చేస్తున్నారని, ఇందులో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.

గతంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుండి పాఠాలు నేర్చుకున్న ఇరాన్, ఇప్పుడు తన యుద్ధ వ్యూహాలను మార్చుకుని మరింత పక్కాగా ప్రతీకార ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా - ఇజ్రాయెల్ కలిసి తమ దేశంపై మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఆ అధికారి అంచనా వేశారు. అయితే, శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు తమ సాయుధ దళాలు (IRGC) ప్రస్తుతం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం రక్షణకే పరిమితం కాకుండా, తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగితే ప్రతీకార దాడులకు వెనుకాడబోమని హెచ్చరించడం ద్వారా వారు తమ సైనిక పటిమను చాటుకుంటున్నారు.

Next Story