అంచనాలను అందుకుంటుందా?.. జట్టును విజయపథాన నడిపిస్తాడా ?

by Dishanational1 |
అంచనాలను అందుకుంటుందా?.. జట్టును విజయపథాన నడిపిస్తాడా ?
X

ఐపీఎల్-2022‌లో ఈసారి మొత్తం పది జట్లు సందడి చేయనుండగా అభిమానుల ఆశలన్నీ కొత్త జట్లపైనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ -15లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జాయంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఏ మేరకు ఆకట్టుకుంటాయోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జాయంట్స్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ గానే కాకుండా కెప్టెన్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సీజన్‌లో లక్నో జట్టును విజయపథాన నడిపిస్తాడని ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బెంగళూరు: లక్నో సూపర్ జాయంట్స్ జట్టు తొలిసారిగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో పాటు కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, అతనికి గతంలో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం లేదు. గుజరాత్‌తో పోలిస్తే రాహుల్‌కు ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ మ్యాచుల్లోనూ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం మెండుగా ఉంది. రాహుల్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యం కలిగి ఉండటంతో ఈ ఐపీఎల్ సీజన్‌‌లో లక్నో టీంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే, మార్చి 28న లక్నో జాయంట్స్ జట్టు తొలిమ్యాచ్ వాంఖడే మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

కెప్టెన్‌గా విన్నింగ్ రికార్డు..

పంజాబ్ కింగ్స్ జట్టు సారథిగా కేఎల్ రాహుల్ మంచి రికార్డును కలిగి ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లలో రాహుల్ మొత్తంగా 27 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో 11 విజయాలు, 14 పరాజయాలు, 2 డ్రాగా ముగిశాయి. మొత్తంగా రాహుల్ సారథ్యంలో నడిచే జట్టుకు 44.44 శాతం విజయావకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, లక్నో టీంలో అత్యధికంగా ఆల్ రౌండర్స్, అనుభవం కలిగిన కీలక ఆటగాళ్లు ఉండటం ఈ జట్టుకు ప్లస్ కానుంది. గతేడాది వలే రాహుల్ ఈసారి కూడా అటు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మెరుగ్గా రాణించగలిగితే లక్నో జట్టుకు విజయావకాశాలు కూడా మెండుగా ఉండనున్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టు సారథిగా పరుగుల వరద..

కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాక మెరుగ్గా రాణించాడు. కెప్టెన్‌గా 27 మ్యాచులు ఆడిన రాహుల్ మొత్తంగా 1,296 పరుగులు సాధించాడు. అందులో 1 సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 132గా ఉంది. ఇక బ్యాటర్‌గా 2018 నుంచి 2021 ఐపీఎల్ సీజన్లలో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఈ మూడు ఫ్రాంచైజీల తరఫున 94 మ్యాచులు ఆడిన రాహుల్ ఏకంగా 3,273 అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు.

వేలంలో అత్యధిక ధర..

పంజాబ్ జట్టు నాయకత్వ బాధ్యతలు వదులుకుని వేలంలో పాల్గొన్న కర్ణాటక ప్లేయర్ కేఎల్ రాహుల్‌(29)‌ను లక్నో సూపర్ జాయంట్స్ జట్టు ఏకంగా రూ. 17 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (రూ. 17 కోట్లు) తర్వాత మళ్లీ అంతటి ధర పలికిన ఆటగాడిగా లోకేశ్ రాహుల్ రికార్డులకెక్కాడు.

లక్నో టీం ప్లేయర్లు..

మానన్ వోహ్రా, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), క్వింటన్ డికాక్ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, దుశ్మంత చమీరా, షాబాజ్ నదీమ్, మెహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, అంకిత్ రాజ్పుత్, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్, మార్కస్ స్టోనియిస్, కైల్ మేయర్స్, కరన్ శర్మ, కే గౌతమ్, ఆయుష్ బదౌనీ, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్. కాగా, లక్నో జట్టు 3 బ్యాట్స్‌మన్స్, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్స్, 8 మంది బౌలర్లు, 8 మంది ఆల్ రౌండర్లతో పటిష్టంగా ఉంది.

Next Story