తెలుగు జానపదం బుర్రకథకు అరుదైన ఘనత.. టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక

by Ramesh N |
తెలుగు జానపదం బుర్రకథకు అరుదైన ఘనత.. టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. అది కూడా బైబిల్ కథ ఆధారంగా రూపొందించిన బుర్రకథ. 'శాంసన్‌ అండ్‌ దెలీలా' అనే బుర్రకథ టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్‌ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్‌ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్‌ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్‌ కథ ఆధారంగా శాంసన్‌ అండ్‌ దెలీలా బుర్ర కథను రూపొందించారు. టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న ఈ బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఈ చిల్కూరి బుర్రకథ బృందం 1970 చివర, 1980 నుంచి తమ ప్రదర్శనలను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చారు. కాగా, ఈ బృందంలోని సభ్యుల విషయానికొస్తే.. చిల్కూరి శ్యామ్‌ రావు సీనియర్‌ న్యాయవాది. చిల్కూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్‌ థియోలాజికల్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. చిల్కూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు.

Next Story

Most Viewed