కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు

by Malleboina Mahesh |

నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న అగస్త్య, శ్రీగురు కాలేజీలకు ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసులు. నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు రద్దు!

కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే, అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల కాకముందే విద్యార్థులను చేర్చుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని రెండు కార్పొరేట్ కాలేజీలకు బోర్డు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే కొన్ని కార్పోరేట్ విద్యా సంస్థలు భారీ హెర్డింగులు, ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తూ అడ్మిషన్లు మొదలుపెట్టాయి. దీనిపై సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన బోర్డు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాలేజీల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా యాజమాన్యాలను ఆదేశించింది.

అగస్త్య, శ్రీగురు కాలేజీలకు నోటీసులు

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రక్రియపై సీజేఎస్ నుండి బోర్డుకు భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని శ్రీగురు, అగస్త్య జూనియర్ కాలేజీలపై, అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని, బోర్డు షెడ్యూల్ రాకముందే ఫీజులు వసూలు చేస్తున్నారని, విచ్చల విడిగా హెర్డింగులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగారెడ్డి డీఐఈఓ ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

గ్రేటర్ పరిధిలోనే 80 శాతం కాలేజీలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రైవేటు జూనియర్ కాలేజీలలో దాదాపు 80 శాతం కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల) పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక్కడే పోటీ ఎక్కువగా ఉండటంతో, విద్యార్థులను ఆకర్షించేందుకు కాలేజీలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. అడ్మిషన్ల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ఇప్పటికే హెచ్చరించింది. తల్లిదండ్రులు కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎటువంటి అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది.

రూల్స్ పాటించని కాలేజీలపై చర్యలు వేగవంతం చేయాలి: సీజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిలాల పరిధిలోని కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. అందులో కొన్ని కాలేజీలకు అసలు అనుమతులే లేవు. రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎక్సలెన్షియా, అగస్త్య, శ్రీగురు కాలేజీలపై ఇప్పటికే ఇంటర్ బోర్డు కు ఫిర్యాదు చేశాం. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story