- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా వెళ్తున్న నౌక.. భారత అధికారి ఏమయ్యాడో??
చైనాకు వెళ్తున్న ఒక వాణిజ్య నౌకలోని భారతీయ అధికారి అదృశ్యం కావడం సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : చైనాకు వెళ్తున్న ఒక వాణిజ్య నౌకలోని భారతీయ అధికారి అదృశ్యం కావడం సంచలనం రేపింది. అతను ఒడిశాకు చెందిన మర్చంట్ నేవీ అధికారి సార్థక్ మహాపాత్రో అని సమాచారం. ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల సార్థక్.. జూలై 2025 నుంచి ఆంగ్లో-ఈస్టర్న్ షిప్ మేనేజ్‌మెంట్ అనే ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో సీనియర్ డెక్ క్యాడెట్‌గా పని చేస్తున్నాడు. అతను పనిచేస్తున్న M.V. EA Jersey అనే నౌక చైనా నుంచి వెస్ట్ ఆఫ్రికా వెళ్లి, తిరిగి సింగపూర్ మార్గంలో చైనాకు వస్తోంది. సార్థక్ అదృశ్యమైన సమయంలో నౌక మారిషస్ దేశం సమీపంలో, ఇండియన్ ఓషన్ అంతర్జాతీయ జలాల్లో ఉంది. ఫిబ్రవరి 3న సార్థక్ అదృశ్యం కాగా.. ముందు రోజు తన తల్లిదండ్రులతో, స్నేహితులతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
అయితే ఫోన్లో నార్మల్ గానే మాట్లాడినట్టు, అతనికి ఎలాంటి ఒత్తిళ్లు లేవని, చాలా ధైర్యవంతుడని తల్లిదండ్రులు చెబుతున్నారు. నౌకా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న ఉదయం సుమారు 6:15 గంటలకు, సార్థక్ తన క్యాబిన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత నుంచి అతను ఎక్కడా కనిపించలేదని, అంతా కలిసి నౌక మొత్తం వెతికినప్పటికీ సార్థక్ ఆచూకీ దొరకలేదని చెబుతున్నారు. అప్రమత్తమైన మిగతా అధికారులు వెంటనే చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత 3 రోజుల నుంచి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. నౌక చీఫ్ ఆఫీసర్ ద్వారా ఈ విషయాన్ని సార్థక్ కుటుంబానికి ఈమెయిల్ ద్వారా తెలియజేయడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కుమారుడు అదృశ్యమయ్యాడన్న వార్త విన్న అనంతరం అతని తల్లి తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తమ కుమారుని ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి, ఒడిశా ముఖ్యమంత్రికి, విదేశాంగ సెక్రటరీకి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు కుటుంబ సభ్యులు లేఖలు రాశారు. అలాగే భద్రక్ జిల్లాలోని సహిద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఒడిశా ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కోరింది.
అయితే సముద్ర జలాల్లో వ్యక్తులు అనుకోని ప్రమాదాలకు గురవడం సాధారణమే అయినా.. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇంతకీ సార్థక్ ఏమయ్యాడు అనేది ఎవరూ నౌక సిబ్బంది గాని, నేవీ అధికారులు గాని ఒక అంచనాకు రాలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సార్థక్ క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు.






