అమెరికా-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. భారత ఎంబసీ హెచ్చరికలు

by Muthe.Rajitha |

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ భయం, ఇరాన్ లో జరుగుతున్న అంతర్గత ఆందోళనల నేపథ్యంలో అక్కడి భారతీయులకు భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. భారత ఎంబసీ హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, "ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చు" అన్న వదంతులు, అలాగే టెహ్రాన్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు కలిసి పరిస్థితిని గందరగోళంగా మార్చాయి. ఈ నేపథ్యంలో భారత ఎంబసీ సోమవారం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. గతంలో ఇచ్చిన సూచనల కొనసాగింపుగా ఈ తాజా హెచ్చరిక విడుదలైంది.

తక్షణమే ఇరాన్ ను వీడండి

ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, టూరిస్టులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి (వాణిజ్య విమానాలు సహా) వీలైనంత త్వరగా ఇరాన్ ను వదిలి వెళ్లాలని సూచించింది. ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక వార్తా మాధ్యమాలను గమనిస్తూ, పరిస్థితులపై అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించింది. పాస్‌పోర్ట్, వీసా, ఇతర గుర్తింపు కార్డులు ఎప్పుడూ సులభంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లు కూడా వెల్లడించింది: +98 912 810 9115, +98 912 810 9109, +98 912 810 9102, +98 993 217 9359. మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే ఇరాన్‌కు నాన్-ఎసెన్షియల్ ట్రావెల్‌ను నిషేధించింది.

అమెరికా-ఇరాన్ యుద్ధ టెన్షన్లు

ప్రస్తుతం అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర దశకు చేరుకున్నాయి. గత ఏడాది జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత మళ్లీ ఇరాన్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా న్యూక్లియర్ డీల్ చర్చలే ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారాయి. జెనీవాలో ఓమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఇండైరెక్ట్ చర్చలు ఇంకా ఫలితం ఇవ్వలేదు. ఫిబ్రవరి 26న మూడో రౌండ్ చర్చలు జరగనున్నాయి. అమెరికా "జీరో ఎన్‌రిచ్‌మెంట్" అంటే ఇరాన్ యురేనియం ఎన్‌రిచ్ చేయకూడదని కోరుతోంది. ఇరాన్ ఈ డిమాండ్‌ను పూర్తిగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 20న ఇరాన్‌కు 10–15 రోజుల గడువు ఇచ్చి, డీల్ కుదరకపోతే "really bad things" జరుగుతాయని హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ సైనిక సమీకరణ చేపట్టింది. రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ అయిన USS Abraham Lincoln, USS Gerald R. Ford ను ఇప్పటికే మోహరించాయి. ఇరాన్ న్యూక్లియర్ సైట్లు, బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలు, IRGC బేస్‌లపై దాడులకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇరాన్ కూడా యుద్ధానికి సై అంటోంది. సాటిలైట్ చిత్రాల ప్రకారం భూగర్భ బంకర్లు, మిస్సైల్ కేంద్రాలను బలోపేతం చేస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద రష్యాతో కలిసి నేవల్ ఎక్సర్‌సైజ్ నిర్వహించడం గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ఒత్తిడి తీసుకురావడమేనని భావిస్తున్నారు. టెహ్రాన్‌లో విద్యార్థుల ఆందోళనలు రెండో రోజు కొనసాగుతుండటం దేశీయ ఒత్తిడిని పెంచుతోంది. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ "ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నాం" అని ప్రకటించారు. మొత్తం పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. చర్చలు విఫలమైతే సైనిక దాడులు.. ముఖ్యంగా న్యూక్లియర్, మిస్సైల్ కేంద్రాలపై అమెరికా విరుచుకుపడే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story