అమెరికాలో భారత జంటకు చేదు అనుభవం.. ఇండియా వెళ్లిపోవాలంటూ బూతులు

by Muthe.Rajitha |

అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపరలో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.

అమెరికాలో భారత జంటకు చేదు అనుభవం.. ఇండియా వెళ్లిపోవాలంటూ బూతులు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై జరుగుతున్న జాత్యహంకార (Racist) దాడుల పరంపరలో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. రోడ్డు పక్కన నిలబడి సాధారణంగా ఫోటోలు తీసుకుంటున్న ఒక భారతీయ జంటను టార్గెట్ చేస్తూ ఓ స్థానిక వ్యక్తి తీవ్రంగా అవమానించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో కలకలం రేపుతున్నాయి.

వీడియో ఆధారంగా తెలిసిన వివరాల ప్రకారం.. సదరు భారతీయ జంట వీధిలో ఫోటోలు దిగుతుండగా, అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి వారిని ఉద్దేశించి "మీరు ఇండియా నుంచి వచ్చారా?" అని ప్రశ్నించాడు. దానికి ఆ జంట ఎంతో మర్యాదగా "అవును" అని సమాధానమిచ్చారు. ఆ వెంటనే సదరు వ్యక్తి "మరి మీకు ఇండియా ఇష్టమా? లేక అమెరికా ఇష్టమా?" అంటూ మరో ప్రశ్న వేశాడు. దానికి వారు చాలా లౌక్యంగా, హుందాగా బదులిస్తూ.. "మాకు రెండూ ఇష్టమే, ఎందుకంటే మా కుటుంబం అంతా ఇండియాలోనే ఉంటుంది" అని చెప్పారు. వారి సమాధానంతో సంతృప్తి చెందని ఆ వ్యక్తి ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. "అయితే వెంటనే మీ దేశానికే తిరిగి వెళ్లిపోండి, ఇక్కడికెందుకు వచ్చారు?" అంటూ అత్యంత దారుణంగా బూతులు తిడుతూ, అసభ్య పదజాలంతో వారిపై విరుచుకుపడ్డాడు. ఈ అకస్మాత్తు పరిణామానికి ఆ జంట తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని బాధితులు తమ ఫోన్‌లో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. విదేశాలలో స్థిరపడిన భారతీయులపై, పర్యాటకులపై ఇలాంటి వివక్ష, ద్వేషపూరిత దాడులు (Hate Crimes) రోజురోజుకూ పెరిగిపోతుండటం పట్ల నెటిజన్లు, ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story