అభివృద్ధిలో భారత్ సరికొత్త రికార్డులు: ఆక్లాండ్‌లో ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

న్యూజీలాండ్‌ ఆక్లాండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగం.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డు!

అభివృద్ధిలో భారత్ సరికొత్త రికార్డులు: ఆక్లాండ్‌లో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో శనివారం నిర్వహించిన భారతీయ సమాజ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వివిధ రంగాలలో భారత్ సాధిస్తున్న అంతర్జాతీయ మైలురాళ్లను ప్రపంచ వేదికపై గర్వంగా చాటారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుగా, పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ప్రధాని వెల్లడించారు. అలాగే అంతర్జాతీయంగా మొబైల్ తయారీలో, టెలికాం మార్కెట్‌లో, గోధుమలు, చేపల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని, మొబైల్ డేటా వినియోగంలో అగ్రగామిగా దూసుకుపోతోందని కొనియాడారు.

నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా, అత్యంత వేగంగా విస్తరిస్తున్న మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. త్వరలోనే పునరుత్పాదక ఇంధన (Renewable Energy) ఉత్పత్తిలోనూ భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకోబోతోందని, సోలార్ ఎనర్జీ కెపాసిటీలోనూ అగ్రగామి దేశాల సరసన నిలిచిందని వెల్లడించారు. నేటి భారతదేశం ప్రపంచానికి సరికొత్త అభివృద్ధి నమూనాలను అందిస్తోందని చెప్తూ.. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజయాల పట్ల నేడు ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయని ప్రధాని మోదీ సగర్వంగా ప్రకటించారు.

Next Story