ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి భేటీ

by Malleboina Mahesh |

ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి కీలక సమావేశం జరగనుంది. ఓట్ల తొలగింపు (SIR) అంశంపై సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాసే అవకాశం.

ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ద్వారా పార్టీకి నష్టం వాటిల్లకుండా చూసేందుకు ఏఐసీసీ దృష్టిసారించింది. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 8న హైదరాబాద్ లో జరగబోయే ఇండియా కూటమి సమావేశం పార్టీకి బూస్ట్ ఇవ్వనుందని నేతలు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఈనెల 8న సమావేశమైన ఇండియా కూటమి నేతలు అనేక కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై 23 పార్టీలు నుంచి 35 మంది ప్రతినిధులు హాజరై చర్చించారు.

అందులో ప్రధానంగా ఎస్ఐఆర్ పై గందరగోళం, ఓట్ల తొలగింపుపై చర్చ నడిచింది. మోసపూరిత ఎన్నికలపై సుప్రీంకోర్టు చీఫ్​జస్టిస్ కు లేఖ రాస్తామని ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘డీఎంకే’ కూటమి నుంచి వైదొలగింది. ‘ఆప్’ పంజాబ్ లో కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా భావిస్తున్నందున ఆ పార్టీ సైతం కూటమికి దూరంగా ఉంటుంది.

ఎస్ఐఆర్ పై అభ్యంతరాలు

రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై తమకున్న అభ్యంతరాలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు సీఈసీకి తమ అభ్యంతరాలు, సూచనలు, అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాన్ని ఇటీవలే టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్ లో 90 లక్షలు ఓట్లను తొలిగించడం ద్వారా ఫలితాలు తారుమారు అయ్యాయని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఏడాది పాటు వాయిదా వేయాలని, ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం, బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించాలన్న డిమాండ్లను ఇప్పటికే టీపీసీసీ ఈసీ ముందు పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఎల్ఏల నియామకం చేపట్టడంతో పాటు వారికి శిక్షణ కార్యక్రమాలను ట్రైనర్ ద్వారా అందిస్తున్నారు. సాంకేతిక, క్షేత్రస్థాయి విధివిధానాలపై సమగ్రమైన శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు.

త్వరలో ఎన్నికలు

ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో కూటమి సమావేశాలను నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఐదారు నెలల్లో ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రతిపక్ష పార్టీల అధినేతలు హాజరయ్యే సమావేశం కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్ట్ ఇస్తుందన్న ఆశాభావంతో హస్తం నేతలు ఉన్నారు. దీంతో ఇండియా కూటమి సమావేశం, ఆ తర్వాత జరిగే పరిణామాలపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Next Story