IND VS NZ: కీలక పోరులో టీమిండియాకు షాక్.. 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 17:18:51  IST  )

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇవాళ జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌పై 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

IND VS NZ: కీలక పోరులో టీమిండియాకు షాక్.. 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇవాళ జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌పై 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 3-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఈ ఓటమితో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. టిమ్ సీఫెర్ట్ (62) మరియు డెవాన్ కాన్వే (44) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు కేవలం 8.2 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. ఆఖర్లో డారిల్ మిచెల్ (39 నాటౌట్) వేగంగా ఆడటంతో స్కోరు 200 దాటింది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసుకుని పరవాలేదనిపించారు.

శివమ్ దూబే వీరబాదుడు..

216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (8) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసిన దూబే, మొత్తం 23 బంతుల్లో 65 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రింకూ సింగ్ (39) పోరాడినప్పటికీ అవతలి వైపు వికెట్లు పడుతుండటంతో భారత ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లతో అదరగొట్టాడు.

Next Story