- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హయత్‌నగర్‌లో హైవేలను ఆనుకొని అక్రమ నిర్మాణాలు
హయత్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల జోరు! నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు, షెడ్లు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన.

దిశ, వనస్థలిపురం : మల్కాజ్‌గిరి మున్సిపల్‌కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్.. హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సెల్లార్లు తవ్వడం, షెడ్ల పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టడం రోజువారీ వ్యవహారంగా మారింది. దీనిపై స్థానికులు ఫిర్యాదులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు గాలికొదిలి నిర్మాణాలు..
హయత్‌నగర్ సర్కిల్‌లోని వనస్థలిపురం డివిజన్ప్రశాంత్నగర్లో పనామా గోడౌన్స్ఎల్బీనగర్ వెళ్లే రూట్‌లో సర్వీస్ రోడ్డును ఆనుకొని ఎంఎంసీ నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ సెల్లార్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్ అవసరాల పేరుతో మొదలైన ఈ పనులు క్రమంగా వాణిజ్య వినియోగానికి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతలకుంట డివిజన్‌లోని శక్తి నగర్ రోడ్డు నంబర్-8లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సెల్లార్ నిర్మిస్తున్నారు.
టెంపరరీ పేరుతో షెడ్ల నిర్మాణాలు..
వనస్థలిపురం, చింతల్‌కుంట, హైకోర్టు కాలనీ, హయత్‌నగర్ డివిజన్లలో షెడ్ల నిర్మాణాలకు కూడా అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. షెడ్ల పేరుతో తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభించి, వాటిని శాశ్వత భవనాలుగా మార్చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. హయత్‌నగర్ డివిజన్‌లోని సూర్యనగర్ కాలనీలో రోడ్డును ఆనుకొని భారీ రేకుల షెడ్డు నిర్మిస్తున్నా.. ఎంఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.
భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు..
ఎల్బీనగర్‌లో సెల్లార్లు కూలి చనిపోయిన ఘటనలతో పాటు, సెల్లార్ల ద్వారా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్రమంగా తవ్వుతున్న సెల్లార్లు భవనాల స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, భూగర్భ జలాల సమస్యలు, పార్కింగ్ కొరత లాంటి సమస్యలు భవిష్యత్తులో తీవ్రమయ్యే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
అనేక ఫిర్యాదులు.. ఫలితం శూన్యం..
ఈ అక్రమ నిర్మాణాలపై పలుమార్లు హయత్‌నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందించినప్పటికీ.. ఆఫీసర్లు, సిబ్బంది కేవలం తనిఖీలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నోటీసులు ఇచ్చినా, తర్వాత చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణదారులు మరింత ధైర్యంగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేస్తున్నారని వాపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు..
నియమాలను అమలు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే హయత్‌నగర్ సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హయత్ నగర్ టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు, నిర్మాణాల కూల్చివేత లాంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






