తిరుమల సన్నిధిలో అక్రమ 'లక్కీ డ్రా' దందా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు!

by Malleboina Mahesh |

అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ లక్కీ డ్రా ప్రచారం కలకలం సృష్టిస్తోంది.

తిరుమల సన్నిధిలో అక్రమ లక్కీ డ్రా దందా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు!
X

దిశ, వెబ్ డెస్క్: అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో అక్రమ లక్కీ డ్రా (Illegal lucky draw) ప్రచారం కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం రూ. 399 చెల్లిస్తే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులను లక్కీ డ్రా' ద్వారా గెలుచుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ కోసం వారు ఏకంగా అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయ పరిసరాలను వేదికగా చేసుకోవడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వాణిజ్యపరమైన, మోసపూరిత ప్రచారాలు నిర్వహించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి (Karate Kalyani) తీవ్రంగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆమె హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులు ప్రవీణ్ క్యాసా, మహేందర్‌లపై సెక్షన్ 318(4), ఐటీ చట్టం (66 ITA Act 2008) కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story