హస్తినాపురంలో కమర్షియల్ అక్రమ కట్టడాలు

by Malleboina Mahesh |

హస్తినాపురంలో అధికారుల నిర్లక్ష్యంతో కమర్షియల్ అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. పార్కింగ్ స్థలంలో షెటర్లు వేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

హస్తినాపురంలో కమర్షియల్ అక్రమ కట్టడాలు
X

దిశ, హస్తినాపురం : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాష్ట్రానికే వెన్నెముక లాంటిది. జీహెచ్ఎంసీ పాలన సౌలభ్యం కోసం పరిధిని విస్తరించి మూడు విభాగాలుగా విభజిస్తూ పరిపాలన సాఫీగా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ, ఎల్బీనగర్ సర్కిల్ 13 ఎంఎంసీలో మాత్రం విరుద్ధంగా కొనసాగుతుంది. హస్తినాపురం, బైరమల్ గూడ, బీఎన్ రెడ్డి నగర్, సాహెబ్ నగర్ డివిజన్‌లో అక్రమ కట్టడాలు కొనసాగుతున్నప్పటికీ ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం టీపీవో అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమ కట్టడాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. ఈ అక్రమ కట్టడాలను టీపీవో, చైన్ మెన్ల పర్యవేక్షణలో విచారించి అక్రమ కట్టడాలకు 1, 2, 3 నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ అక్రమ కట్టడాలు కట్టి గృహప్రవేశాలు కూడా జరుపుకుంటున్నప్పటికీ ఎల్బీనగర్ సర్కిల్, టీపీవో అర్చన మాత్రం వీటన్నింటికీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని తన దృష్టికి తీసుకెళ్లినా ఆమె ఎందుకో స్పందించడం లేదు. ఎలాంటి చర్యలకూ ముందుకు రావడం లేదు. కనీసం నోటీసులు కూడా జారీ చేయని పరిస్థితి నెలకొంది. గ్రీవెన్స్- ఆన్లైన్లో ఎన్నో కంప్లైంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటిపై విచారణ జరిపి చర్యలకు పూనుకోకపోవడం విచారకరం. ఇంతకు ఆన్ లైన్‌లో ఫిర్యాదులను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారని బస్తీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలపై టీపీవో అర్చనను వివరణ కోరగా.. ‘మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఏముంది’ అంటూ దాటవేస్తున్నారు.

చేతివాటం ప్రదర్శిస్తూ..?

చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ కట్టడాలకు కొమ్ముకాస్తున్నట్టు ఎంఎంసీ ఆఫీసులోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డివిజన్ వందనపురి కాలనీ, రోడ్ నెంబర్ మూడులో స్టిల్డ్ ప్లస్, రెండు అంతస్తులకు మాత్రమే గృహ నిర్మాణానికి అనుమతులు పొంది గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా పార్కింగ్ కు వదిలేయాల్సి ఉంది. ఏకంగా మూడు వ్యాపార సముదాయం షెటర్లు నిర్మించి ఆపై రెండు ఫ్లోర్లు, ఆపైన పెంట్ హౌస్ అక్రమంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ అక్రమ కట్టడంపై గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు ఉన్నప్పటికీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయడం కానీ, చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.

ఈ అక్రమ కట్టడంపై స్థానికులు ప్రశ్నిస్తే.. ఇది ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిదిగా చెప్పుకుంటూ, కొంతమంది స్థానిక నాయకులు, ఈ అక్రమ కట్టడానికి కొమ్ము కాస్తూ, ప్రశ్నించిన స్థానికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. కాగా, ప్రభుత్వ ఖజానాను నింపవలసిన ఈ అధికారులే ఆదాయానికి భారీ గండి కొట్టడంతో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఇటీవల ఏసీబీ అక్రమఈ అక్రమ కట్టడంపై టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్‌ను వివరణ కోరగా.. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story