- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ దాడులు చేసినా మారని తీరు: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 'మామూళ్ల' పర్వం
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆగని వసూళ్లు! ఏసీబీ దాడులు చేసినా మారని అధికారుల తీరు. ఏజెంట్ల ద్వారా డాక్యుమెంట్‌కు ఒక రేటు ఫిక్స్. సామాన్యుల విలవిల.

దిశ, వరంగల్ బ్యూరో : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్న డబ్బుల వసూలు ఆగడం లేదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే డాక్యుమెంట్ ను బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చెల్లింపులు ఆలస్యం అయితే డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసి ఫీజులు చెల్లించిన అనంతరం ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ప్రతి డాక్యుమెంట్ కు ఓ రేటు, సింబల్ ఇచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వసూళ్ల తర్వాతనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వారికి అందిస్తున్నారు. ఈ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అధికారులపై కేసులు నమోదు చేసిన డోంట్ కేర్ అనే రీతిలో వ్యవహారం కొనసాగుతుంది.
ఉమ్మడి జిల్లాలో వడ్డేపల్లి, వరంగల్ పోర్టు, వరంగల్ రూరల్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, కొడకండ్ల, భీమదేవరపల్లి, పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, వర్ధన్నపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి రోజు ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్, పట్టణాలు, గ్రామీణ పరిధిలోని నివాస స్థలాలు, మార్ట్ గేజ్ లకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఛార్జీలు చెల్లించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఏజెంట్లు, బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లను అనుమతించవద్దు. వారు లేకుండానే కార్యాలయాల సిబ్బంది పనులన్నీ చేసి పెట్టాలి. నిబంధనల మేరకు అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
వందలాది డాక్యుమెంట్ల సీజ్..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక్కడే అసలైన తతంగం మొదలవుతుంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వచ్చే డాక్యూమెంట్ల రిజిస్ట్రేషన్ కు ఇంతా అని రేట్లను నిర్ణయిస్తున్నారు. వాటి రేటుకు అనుగుణంగా ఏజెంట్లతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో నమోదు చేసిన పేపర్లు రిజిస్ట్రేషన్ సమయంలో అందించగానే వాటిపైన టిక్ మార్కులు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏజెంట్లు, బ్రోకర్లు లేకుండా వచ్చే వారిని ఏదో రూపాన డాక్యుమెంట్లు లేవని పక్కకు పెడుతున్నారు. వాటి రిజస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను తీసుకురావాలని కోరుతున్నారు. రోజుల తరబడి తిరుగుతూ ఇబ్బంది పడి చివరకు ఏజెంట్ల ద్వారా పైరవీలు చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చూసిన ఇదే రూపకంగా జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు మూడు రోజుల క్రితం తనిఖీ చేసిన వడ్డెపల్లిలో గాని కొన్ని నెలాల క్రితం తనిఖీ చేసిన భూపాలపల్లి కాని ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కానీ ఏజెంట్లే నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. లెక్కకు మించి డబ్బులను పట్టుకోవడంతో పాటు వందలాది డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అధికారులు తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల సీనియర్ అసిస్టెంట్లకు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ గా అవకాశాలు ఇస్తున్నారు. ఇంచార్జిలు ఉన్న చోట ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లకు వేలాది రూపాయల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లావాదేవీలను పరిశీలించారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్ని చేసిన అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసిన ఏసీబీ కేసులు పెట్టిన ఈ తతంగం మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు మరింత దృష్టి పెడితే కొంతమేరకు డబ్బుల వసూళ్లను అరికట్టే అవకాశం ఉంది.






