బంపర్ ఆఫర్.. ప్రభుత్వ బడిలో చేరితే రిటర్న్ రూ. 2 వేలు

by Muthe.Rajitha |

ఆ ప్రభుత్వ బడిలో పిల్లలను జాయిన్ చేయిస్తే వారికి రూ.2 వేలు ఇస్తామని ఆ ఊరి సర్పంచ్ ప్రకటించారు.

బంపర్ ఆఫర్.. ప్రభుత్వ బడిలో చేరితే రిటర్న్ రూ. 2 వేలు
X

దిశ, వెబ్ డెస్క్ : కనుమరుగవుతున్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన ఊరిలోని ప్రభుత్వ బడి ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడకూడదనే పట్టుదలతో.. ఆ స్కూల్లో చేరే ప్రతి విద్యార్థికి రూ. 2,000 నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తానంటూ ఓదెల మండలం శానగొండ గ్రామ సర్పంచి జీల రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. శానగొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Primary School) లో విద్యార్థుల సంఖ్య ఏటా దారుణంగా పడిపోతోంది. గత విద్యా సంవత్సరంలో ఈ బడిలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2026-27) కొత్తగా ఒక్క విద్యార్థి కూడా చేరే పరిస్థితి కనిపించకపోవడంతో స్కూల్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఏర్పడింది. దీనిని గమనించిన సర్పంచ్ జీల రాజు ఎలాగైనా బడిని బతికించుకోవాలని సంకల్పించారు. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ నగదు బహుమతిని ప్రకటించారు. ఈ నగదును రాబోయే దసరా పండుగ నాటికి విద్యార్థులకు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ వినూత్న ప్రచారంలో భాగంగా శనివారం నాడు సర్పంచ్ జీల రాజు స్థానిక గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ఉత్సాహంగా 'బడి బాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలన్నింటినీ గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని, తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్థికంగా భారం పడకుండా ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సర్పంచ్, ఉపాధ్యాయ బృందం గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ చొరవతో ఈ ఏడాది పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story